జాతీయ వార్తలు

మాల్యాను అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో సహకారాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శనివారం ఆయన ఈ విషయమై బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు. ప్రముఖ మద్యం వ్యాపారి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ మాల్యా, ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాజీ చీఫ్ లలిత్ మోడీ లాంటి బడా ఆర్థిక నేరగాళ్లను బ్రిటన్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని వివిధ బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంపై డిసెంబర్ 4న తుది విచారణ జరపాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు కొద్ది రోజుల క్రితం నిర్ణయించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అన్ని సాక్ష్యాధారాలు అందాయని, వీటని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సిపిఎస్) సమీక్షించిందని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో మాల్యాకు షరతులతో మంజూరు చేసిన బెయిలు గడువు డిసెంబర్ 4వ తేదీతో ముగుస్తుంది. ఈలోపు విజయ్ మాల్యా కేసు నిర్వహణపై సెప్టెంబర్ 14వ తేదీన న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఆ తర్వాత డిఫెన్సు వారు (మాల్యా తరఫు న్యాయవాదులు) తమ వాదనలను వివరిస్తూ నవంబర్ 17వ తేదీలోగా 30 పేజీల నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై భారత ప్రభుత్వం నవంబర్ 27వ తేదీలోగా స్పందించాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న లలిత్ మోడీ కూడా స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2009లో ఐపిఎల్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన విదేశీ ప్రసార హక్కులను కట్టబెట్టే విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను మోసగించారన్న ఫిర్యాదు మేరకు లలిత్ మోడీతో పాటు మరికొందరు ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం మాల్యాతో పాటు లలిత్ మోడీ కూడా బ్రిటన్‌లోనే నివసిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఐపిఎల్ ఒప్పందాల్లో తాను ఎటువంటి అక్రమాలకూ పాల్పడలేదని లలిత్ మోడీ బుకాయిస్తున్నాడు.

చిత్రం.. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ