జాతీయ వార్తలు

బిజెపి అభ్యర్థి వెంకయ్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 16: ఉపరాష్టప్రతి పదవికి కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేరును బిజెపి అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై లోతుగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెంకయ్యనాయుడు వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖరారు చేయటం లేదు. ఉపరాష్టప్రతి పదవికి పార్టీ తరపున ఎవరు పోటీ చేయాలనేది బిజెపి అధినాయకత్వం నిర్ణయిస్తుందని, రేపుజరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని, అంత వరకు ప్రచారంలోకి వచ్చేవన్నీ ఊహాగానాలేనని అంటున్నారు. అయితే బిజెపి వర్గాలు మాత్రం ఉపరాష్టప్రతి పదవికి పరిశీలనలో ఉన్న పేర్లలో వెంకయ్యనాయుడు పేరు ప్రథమ స్థానంలో ఉన్నదని అనధికారికంగా చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావు, రాజ్యసభ మాజీ ఉపాధ్యక్షురాలు,గవర్నర్ నజ్మా హెప్తుల్లా, తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నా బిజెపి అధినాయకత్వం మాత్రం వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండటం తెలిసిందే. మెజారిటీలో ఉన్న ప్రతిపక్షాలను రాజ్యసభలో అదుపు చేయాలంటే వెంకయ్యనాయుడు లాంటి నాయకుడే సభ అధ్యక్ష పదవిలో ఉండాలని బిజెపి అధినాయకత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం కూడా ఆలోచిస్తోందని అంటున్నారు. ఎన్‌డిఏకు 2020 వరకు రాజ్యసభలో మెజారిటీ రాదు. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన గట్టి నాయకుడు రాజ్యసభ చైర్మన్ పదవిలో ఉండటం అవసరమని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బిజెపి మిత్ర పక్షాలు సైతం వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలిసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్టప్రతి అభ్యర్థి పేరును ఖరారు చేస్తారు. ఆ తరువాతనే దానిని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ పదవికి నామినేషన్లను మంగళవారం లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. బిజెపి పార్లమెంటరీ బోర్డు రేపు ఉపరాష్టప్రతి పదవికి పార్టీ అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రకటించిన అనంతరం ఎళ్లుండి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ప్రతిపక్షం ఉపరాష్టప్రతి పదవికి జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారు చేయటం తెలిసిందే. ఆయన రేపు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉన్నది.
ఊహాగానాలు తగవు:వెంకయ్య
ఉపరాష్టప్రతి పదవికి ఎవరి పోటీ పెట్టాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు బిజెపి పార్లమెంటరీ బోర్డు సోమవారం సమావేశమవుతున్న దృష్ట్యా అభ్యర్థులపై ఊహాగానాలు చేయడం తగదని వెంకయ్య నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవులపై నిర్ణయం ప్రకటించనంత వరకూ పేర్లపై ఊహాగానాలు చేయడం సమంజసం కాదని ఓ ప్రకటనలో ఆయన హితవు పలికారు.