జాతీయ వార్తలు

32మంది ఖైదీలు వేరే జైళ్లకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 16: జైలు అధికారులపై పిర్యాదు చేయడానికి ప్రయత్నించారన్న కారణంపై కర్నాటక పరప్పన అగ్రహార జైలులో ఉన్న 32 మంది శిక్షపడిన ఖైదీలను రాష్ట్రంలోని మరో రెండు జైళ్లకు హటాత్తుగా మార్చారు. ఈ ఖైదీలను ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బళ్లారి, బెలగావిలోని జైళ్లకు మార్చినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. తమిళనాడు అన్నాడిఎంకె (అమ్మ) పార్టీ అధినేత్రి వికె శశికళకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి 2 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న మాటలు వినిపిస్తున్నాయని, చివరికి జైళ్ల విభాగం డిజిపిపైనే అభియోగాలు ఉన్నాయంటూ, జైళ్ల విభాగం డిఐజి డి.రూప డిజిపి సత్యనారాయణ రావుకు నివేదిక సమర్పించిన కొద్దిరోజులకే ఈ ఖైదీలను వేరే జైళ్లకు మార్చడం గమనార్హం. డిజిపి ఈ ఆరోపణలను కొట్టి వేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించడం తెలిసిందే.
‘పరప్పన అగ్రహార జైల్లో ఉన్న 32 మంది శిక్షపడిన ఖైదీలను బెంగళూరు, బెలగావి జైళ్లకు మార్చడం జరిగింది. తమ ఫిర్యాదులను బైటికి చెప్పడానికి ప్రయత్నించినందుకు, జైలు సూపరింటెండెంట్ సహా జైలు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేయడానికి యత్నించినందుకు వారిని మార్చడం జరిగింది’ అని ఆ అధికారి చెప్పారు. డిఐజి రూప తమ సమస్యలను పరిష్కరిస్తారని వారంతా భావించారని, అందుకే వారు ఆమెను ఎలాగైనా కలవాలని అనుకున్నారని ఆ అధికారి తెలిపారు. జైలు సూపరింటెండెంట్‌పై ఖైదీలు చాలా అసంతృప్తితో ఉన్నారని, గతంలో అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినందుకు తమను కొట్టారని వారు ఆరోపిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా, దీనిపై సూపరింటెండెంట్ సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇదిలా ఉండగా రూప రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు రెండో నివేదికను సమర్పించారు. తాను శనివారం రెండో నివేదికను సమర్పించినట్లు ఆమె సైతం చెప్పారు. హోం కార్యదర్శి, అదనపు చీఫ్ సెక్రటరీలు, అవినీతి నిరోధక విభాగం (ఎసిబి) చీఫ్ డిజి, ఐజిపి ఆర్‌కె దత్తా, జైళ్ల విభాగం డిజి సత్యనారాయణ రావులకు ఈ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆ నివేదికలో ఏమున్నది వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. కొంతమంది ఖైదీలతో తాను మాట్లాడినప్పుడు జైళ్ల అధికారుల అవినీతితో సహా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారు తనకు వెల్లడించారని, అయితే వాటికి సంబంధించిన వీడియో ఫుటేజిలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని రూప తన రెండో నివేదికలో పేర్కొన్నట్లు పేరు వెల్లడించని అధికారి ఒకరు చెప్పారు. శశికళకోసం ఒక ప్రత్యేక మీటింగ్ రూమ్‌ను కేటాయించారని, ఆ గదిలో సిసిటీవీ లేదని కూడా ఆమె ఆ నివేదికలో పేర్కొన్నట్లు ఆ అధికారి చెప్పారు. శశికళ సెల్‌కు దగ్గర్లో ఉన్న కొన్ని సిసిటీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా పని చేయకుండా ఉంచారని కూడా ఆమె ఆ నివేదికలో ఆరోపించినట్లు తెలుస్తోంది.