జాతీయ వార్తలు

దళితులంటే అంత చులకనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితుల, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. రైతులు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ ఉభయ సభల్లో పెద్దఎత్తున గొడవ చేశారు. పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్షాలు గొడవకు దిగాయి. దళితులపై జరుగుతున్న దాడులపై మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాంటూ బిఎస్పీ అధినాయకురాలు మాయావతి సభ నుండి ఆగ్రహంతో వాకౌట్ చేశారు.
రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే ఉపాధ్యక్షుడు కురియన్ జీరోఅవర్ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్, బిఎస్‌పి, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడుల గురించి మొదట చర్చించాలని మాయావతి పట్టుపట్టారు. దళితులపై దాడుల గురించి మాట్లాడేందుకు కేవలం మూడు నిమిషాల సమయం కేటాయిస్తే ఎలా అని ఆమె కురియన్‌ను నిలదీశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని బెదిరించారు. ఈ దశలో ఆజాద్ తదితర ప్రతిపక్ష నాయకులు లేచి మాయావతికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మాట్లాడవలసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటే మాయావతికి ఎక్కువ సమయం ఎలా కేటాయిస్తానని కురియన్ ప్రశ్నించారు. మాయావతి మూడు నిమిషాలు మాట్లాడగానే కురియన్ అడ్డుపడ్డారు. దీంతో ఆమె మండిపడుతూ దళితుల గురించి మాట్లాడేందుకు అవకాశం లేని సభలో తానెందుకు కొనసాగాలని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ ఆగ్రహంతో సభ నుండి వాకౌట్ చేశారు.
వివిధ ప్రాంతాల్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ అంటూ ఈ అధికారం మీకెవ్వరిచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులపై చర్చ జరిపేందుకు అంగీకరిస్తేనే ప్రభుత్వంతో సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, ఇతర మంత్రులు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆజాద్ విమర్శించారు. మీరు చర్చకు ఎందుకు అంగీకరించటం లేదని సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. ‘మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. రైతులను ఆత్మహత్యల వైపునెడుతున్నారు. దళితులపై దాడులు కొనసాగిస్తున్నారు ఏమిటిది?’ అని సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి నిలదీశారు. ఈ దశలో కురియన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉంటే మీరెందుకు గొడవ చేస్తున్నారని అనడంతో సభలో మరింత గొడవ చెలరేగింది. ఈ దశలో కురియన్ సభను తొలుత మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో సభ మరి రెండుసార్లు వాయిదా పడిన తర్వాత చివరగా మధ్యాహం 3 గంటలకు కురియన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలో..
లోక్‌సభ మంగళవారం ఉదయం సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానాలు చదివిన అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షం మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, చీఫ్‌విప్ జ్యోతిరాదిత్య సింధియాతోపాటు పలువురు సభ్యులు లేచి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై చర్చ జరపాలని పట్టుపట్టారు. దీనితో సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం పనె్నండు గంటలకు తిరిగి సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ మొదట ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించజేశారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఖర్గే తదితర ప్రతిపక్ష నాయకులు లేచి మరోసారి దళిత, మైనారిటీల సమస్యల గురించి నిలదీశారు. దీనికి అధికార పక్ష సభ్యులు ప్రతిస్పందించటంతో సభలో గందరగోళం నెలకొన్నది. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నినాదాలతో సభ మారుమోగిపోయింది. దీంతో సుమిత్రా మహాజన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

చిత్రాలు.. రాజ్యసభలో మంగళవారం పోడియం వద్ద గొడవ చేస్తున్న విపక్ష సభ్యులు. మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేసి వెళ్లిపోతున్న మాయావతి