జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు వాఘేలా గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జూలై 21: త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలంగా పార్టీపట్ల అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు శంకర్ సింఘ్ వాఘేలా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బిజెపిలో లేదా మరే ఇతర పార్టీలోను చేరే ఉద్దేశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. 77వ పుట్టిన రోజు సందర్భంగా తన మద్దతుదారులతో జరిగిన ఓ సమావేశంలో వాఘేలా ఈ ప్రకటన చేశారు. గుజరాత్ రాజకీయాల్లో సీనియర్ నేత అయిన వాఘేలా రెండు దశాబ్దాల క్రితం బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వాఘేలా ఆగస్టు 8న రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత తన అసెంబ్లీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నెల 17న జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ తరుణంలోనే వాఘేలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలుంటే రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మీరాకుమార్‌కు 49 ఓట్లు మాత్రమే వచ్చాయి.
తాను పార్టీని ఎక్కడ చీలుస్తానన్న భయంలో కాంగ్రెస్ పార్టీ తనను 24 గంటల ముందే పార్టీనుంచి బహిష్కరించిందని వాఘేలా చెప్పారు. అయితే తన భవిష్యత్ ప్రణాళిక ఏమిటో వాఘేలా చెప్పలేదు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీలో ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న వాఘేలా డిమాండ్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించక పోవడంతో మాజీ ముఖ్యమంత్రి అయిన వాఘేలా గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. వాఘేలా రాజీనామా రాజ్యసభకు రాష్ట్రంనుంచి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తక్షణ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాఘేలా తన భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టకపోయినప్పటికీ ఆయన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చిత్రం.. గాంధీనగర్‌లో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు అందించిన కత్తితో వాఘేలా