జాతీయ వార్తలు

వెయ్యి కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: కరవు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వెయ్యి కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కోరారు. కెసిఆర్ చెప్పినదంతా సావధానంగా విన్న మోదీ తెలంగాణకు చేయగలిగినంత సహాయం చేస్తామన్నారు. అయితే, ఎంత ఇచ్చేది, ఎప్పుడిచ్చేది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే, కరవు నెలకొన్న అన్ని రాష్ట్రాల సిఎంలతో చర్చించిన తరువాతే రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కెసిఆర్, సిఎస్ రాజీవ్ శర్మ, రెవెన్యూ కార్యదర్శి మీనా సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశమై తెలంగాణలో నెలకొన్న కరవు, నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి జతేందర్ సింగ్‌తోపాటు మూడు శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు మూలంగా 3,064 కోట్ల నష్టం సంభవించినట్టు నివేదిక పంపిస్తే, కేంద్రం ఇంతవరకు కేవలం 791 కోట్లే ఆర్థిక సాయం చేసిందని సిఎం వివరించారు. కేంద్రం అందించిన సహాయం దేనికీ సరిపోదని కెసిఆర్ మోదీకి వివరించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 271 మండలాల్లో కరవు తాండవిస్తోందని మోదీకి వివరించారు. 13 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 22 లక్షల రైతులకు నష్టం వాటిల్లిందని కెసిఆర్ వివరించారు. ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కూరగాయలు, పండ్లు, ఇతర పంటలు పూర్తిగా నాశనమయ్యాయని వివరిస్తూ, రైతులను ఆదుకునేందుకు కేంద్రం వెంటనే వెయ్యి కోట్లు కేటాయించాలని కెసిఆర్ డిమాండ్ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. తెలంగాణలోని 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించటం జరిగింది కనుక, ఆ జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధానిని కోరామన్నారు. ఈ జిల్లాల అభివృద్ధికిగాను కేవలం 450 కోట్లే ఇచ్చారని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారన్నారు. కరవు నివారణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని కెసిఆర్ ప్రతిపాదించారన్నారు. కరవొచ్చినపుడే స్పందించటం మంచిది కాదంటూనే, శాశ్వత పరిష్కారాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టటం, నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలో 46వేల చెరువులు, కుంటల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్టు వివరించామన్నారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కెసిఆర్ సూచించారన్నారు. మిషన్ భగీరథ కింద 2017నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, నివాస ప్రాంతాలకు మంచినీరు అందిస్తామని మోదీకి కెసిఆర్ వివరించారన్నారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు నిర్వహించి ఆరోగ్య కార్డులను రైతులకు అందిస్తున్నట్టు వివరించారన్నారు. ఏటా ఏర్పడుతోన్న అసమతుల్య వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి కరవు నెలకొంటోందని వివరించారన్నారు. దీన్ని అదుపు చేసేందుకు హరితహారాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారన్నారు. కేంద్రం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా, అవి అమలయ్యేలా మానిటరింగ్ చేయడం లేదని, ఎరువుల పంపిణీపై అదుపులేదని ప్రధానికి కెసిఆర్ ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో చేపడుతున్న నీటిపారుదల పథకాలకు అనుమతులు మంజూరు చేయాలని కెసిఆర్ ప్రధానిని కోరారు. తెలంగాణకు చెందిన ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు. కృష్ణా, గోదావరి జలాల వాటా వినియోగానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపుతామని మోదీకి వివరించారు. ఏ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలనేది మోదీకి కెసిఆర్ స్పష్టం చేయలేదని కడియం వివరించారు. ప్రధానితో సిఎం భేటీ సుహృద్భావ వాతావరణంలో సాగినట్టు కడియం వివరించారు. నీటిని పొదుపుగా వాడాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ఆధునిక పద్ధతిలో ఈ ప్రతిపాదనలను అమలు చేస్తోందని, మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు అమలవుతున్నాయని, లక్షల సంఖ్యలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నామని కడియం వివరించారు.

చిత్రం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర అధికారులతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, అధికారుల బృందం