జాతీయ వార్తలు

పోలీసులను చితకబాదిన ఆర్మీ జవాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 22: అమర్‌నాథ్ యాత్రకు సివిల్ డ్రెస్‌లో వెళ్లి తిరిగి వస్తున్న సైనికులను పోలీసులు అడ్డుకోవడం చినికి చినికి గాలివానగా మారింది. రెచ్చిపోయిన ఆర్మీ జవాన్లు పోలీసు స్టేషన్‌పై దాడి చేసి అడ్డువచ్చిన పోలీసులను చితకబాదడంతో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు 24 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లపై కేసు నమోదు చేశారు. జమ్మూ, కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్‌పి వైద్ ఈ విషయాన్ని ఆర్మీ చినార్ కోర్‌కు చెందిన కోర్ కమాండర్ లెఫ్టెనెంట్ జనరల్ జెఎస్ సంధు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులతో తలెత్తిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని, ఇది చిన్న గొడవేనని ఆర్మీ అంటోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.
అమరనాథ్ యాత్రకు సివిల్ డ్రెస్‌లో వెళ్లిన సైనికులు దర్శనం పూర్తి చేసుకుని ప్రైవేటు వాహనాల్లో బల్తాల్ బేస్ క్యాంప్‌కు తిరిగి వస్తుండగా సోనామార్గ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆపాలంటూ సిగ్నల్ ఇచ్చారు. అయితే సైనికులు వాహనాలను ఆపకుండా గందేర్‌బల్ దిశగా ముందుకు సాగారు. దీంతో సోనామార్గ్ వద్ద ఉన్న పోలీసులు గుండ్ వద్ద ఉండే చెక్‌పోస్టులోని పోలీసులకు ఆ వాహనాలను ఆపేయాలంటూ మెస్సేజ్ ఇచ్చారు. వాహనాలు గుండ్ వద్దకు చేరుకోగానే పోలీసులు వాటిని ఆపడమే కాకుండా వాహనాలు వెళ్లడానికి నిర్ణయించిన సమయం అప్పటికే ముగిసినందున ముందుకు వెళ్లడానికి వీల్లేదని అభ్యంతరం చెప్పారు. సమయం ముగిసిన తర్వాత వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవద్దని తమకు కచ్చితమైన ఆదేశాలున్నాయని కూడా పోలీసులు జవాన్లకు చెప్పారు. అయితే జవాన్లు వినకుండా 24 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన తమ సహచరులకు ఫోన్ చేసి పిలిపించుకోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వారు పోలీసులను చితకబాదారు. స్థానికులు వచ్చి పోలీసులను కాపాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జవాన్లు గుండ్ పోలీసు స్టేషన్‌పై దాడి చేసి అక్కడి ఫర్నీచర్‌ను, ఫైళ్లను కూడా ధ్వంసం చేసి డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టారు. సైనికులు పోలీసు స్టేషన్‌లోని డెస్క్‌టాప్‌లను, లాప్‌టాప్‌లను ధ్వంసం చేయడంతోపాటుగా డైలీ డైరీని చించేసినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, ఈ సంఘటనలో సంబంధం ఉన్న జవాన్లపై చర్య తీసుకోవాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని రాద్ధాంతం చేయడానికి ఇష్టపడని సైన్యం మాత్రం ఈ సంఘటన చాలా చిన్నదని, సీనియర్ అధికారుల జోక్యంతో దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని అంటోంది.