జాతీయ వార్తలు

ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: లోక్‌సభలో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్, సభనుంచి సస్పెండ్ చేశారు. జీరో అవర్‌లో పేపర్లు చింపి స్పీకర్‌పై విసరటం సభా నియమాలను ఉల్లంఘించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, కె సురేష్, అధీర్ రంజన్ చౌదరి, రంజీతా రంజన్, సుష్మితాదేవ్, ఎంకె రాఘవన్‌లను 374 ఎ నియమం ప్రకారం ఐదు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు సుమిత్ర ప్రకటించారు. ‘ఆరుగురు సభ్యులు అత్యంత దురుసుగా వ్యవహరించారు. సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే గట్టిగా శిక్షించాల్సి వచ్చింది. సభ్యులను శిక్షించడం బాధాకరమే అయినా, చర్య తప్పడం లేదు’ అని సుమిత్ర వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యులను ఇంత కఠినంగా శిక్షించటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే నిరసన తెలిపారు. తొలుత లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. లోక్‌సభ మీడియా కూర్చునే టేబుల్ పైనుంచి పేపర్లు లాక్కుని చింపి స్పీకర్‌పైకి పలుమార్లు విసరడంతో సభ భగ్గుమంది. దురుసుగా ప్రవర్తించిన సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ అధికార పక్షం సభ్యులు పెద్దఎత్తున డిమాండ్ చేయటంతో సభ దద్దరిల్లింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌తోపాటు పలువురు ఇతర మంత్రులు కూడా కాంగ్రెస్ సభ్యుల వ్యవహారాన్ని తప్పుపట్టారు. లోకసభ సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పటి నుంచి కాంగ్రెస్ సభ్యు లు గొడవకు దిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గోరక్షకుల పేరిట జరుగుతోన్న దాడులు, కొన్నిచోట్ల హత్యలు చేయటం తదితర అంశాలపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకొచ్చి పెద్దఎత్తున నినాదాలిచ్చారు. దీంతో సభ గందరగోళంలో పడింది. కాంగ్రెస్ సభ్యుల గొడవ మూలంగా లోకసభ మూడుసార్లు వాయిదా పడింది. అయినా సభ్యులు శాంతించ లేదు. దీంతో సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 2.30కు సభను రేపటికి వాయిదా వేశారు. లోకసభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే కాంగ్రెస్, మిత్రపక్షాల సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి గోసంరక్షకుల వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. పోడియం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సుమిత్ర ఇదేం పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగించారు. జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని ఆమె పలుమార్లు కాంగ్రెస్ సభ్యులకు సూచించినా, వినిపించుకోలేదు. కాంగ్రెస్, మిత్రపక్షాల సభ్యులు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగినంత సేపూ పోడియం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూనే ఉన్నారు. జీరో అవర్‌లోనూ అదే విధంగా వ్యవహరించారు. సీట్లలో కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ పలుమార్లు నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది.
లోక్‌సభ రిపోర్టర్లు కూర్చునే టేబుల్ పైవున్న పేపర్లను ముక్కలుగా చించి స్పీకర్‌పైకి విసిరడంతో సభలో గగ్గొలు మొదలైంది. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల దురుసు ప్రవర్తనపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఇరుపక్షాల నినాదాలతో సభ గందరగోళంలో పడింది. సభను వాయిదా వేసిన స్పీకర్, మళ్లీ సమావేశమైన వెంటనే ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను ఐదు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి సభను అర్థగంటపాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనపుడు ప్రతిపక్షం మరోసారి గొడవకు దిగింది. ఆరుగురు సభ్యులకు కఠిన శిక్ష విధించటం న్యాయంకాదని ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. సస్పెండైన ఆరుగురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని డిప్యూటీ స్పీకర్ తంబిదురై సూచించారు. అయితే వారుమాత్రం సభ నుండి వెళ్లేందుకు నిరాకరించారు. మరోవైపు పలువురు కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకొచ్చి నినాదాలు ఇవ్వటం ప్రారంభించారు. దీంతో తంబిదురై లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.