జాతీయ వార్తలు

మరోసారి సిఎంగా నితీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 27: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ రాజ్‌భవన్‌లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటుగా బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సుశీల్ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని తెలుస్తోంది. మహా కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన లాలూప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడితో విభేదాల కారణంగా బుధవారం నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ 12 గంటలు తిరక్క ముందే బిజెపి మద్దతుతో ఆరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం గమనార్హం. 2013 వరకు ఈ రెండు పార్టీలు 13 ఏళ్ల పాటు మిత్రపక్షాలుగా ఉండిన విషయం తెలిసిందే. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలకోసం నరేంద్ర మోదీని బిజెపి ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంతో నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమినుంచి బైటికి వచ్చేశారు. మోదీని ఆ తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే. కాగా, శుక్రవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవలసిందిగా నితీశ్‌ను గవర్నర్ కోరారు. బిహార్, దాని ప్రజల ప్రయోజనార్థమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నితీశ్ అన్నారు. ఇది ఉమ్మడి నిర్ణయమని, బిహార్ ప్రజల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని ఆయన చెప్పారు. నిరాడంబరంగా, క్లుప్తంగా జరిగిన ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రి జెపి నడ్డా, బిజెపి నేత అనిల్ జైన్ తదితరులు హాజరయ్యారు. అయితే నితీశ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జెడి (యు) సీనియర్ నేత శరద్ యాదవ్ గైరుహాజరు కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సిఎం పదవికి నితీశ్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నప్పటినుంచి శరద్ యాదవ్ ఈ పరిణామాలపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం. కాగా, ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జెడి(యు) పార్లమెంటు ఉభయ సభల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది.
బుధవారం సాయంత్రంనుంచి అర్ధరాత్రి దాకా చకచకా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నితీశ్ కుమార్ గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించడం ఆయన దాన్ని ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరడం తెలిసిందే. ఆ వెంటనే బిజెపి పాత మిత్రుడితో జత కట్టనున్నట్లు ప్రకటించడం, అర్ధరాత్రి సమయంలో నితీశ్ కుమార్ గవర్నర్‌ను కలిసి బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలియజేయడం జరిగి పోయాయి. తమకు 132 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు పేర్కొన్న ఎన్డీఏ ఆ మేరకు ఒక జాబితాను గవర్నర్‌కు అందజేసింది కూడా. జెడి(యు)కు చెందిన 71 మంది, బిజెపి 53, ఆర్‌ఎల్‌ఎస్‌పి 2, ఎల్‌జెపి 2, హెచ్‌ఏఎం 1 సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్లు ఈ జాబితాలో ఉన్నారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఆర్‌జెడికి 80 మంది, కాంగ్రెస్‌కు 27 మంది, సిపిఐ-ఎంఎల్‌కు ముగ్గురు సభ్యులున్నారు.

చిత్రం.. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ చేత ప్రమాణం చేయస్తున్న గవర్నర్ కేసరినాథ్