జాతీయ వార్తలు

నితీశ్ పచ్చి అవకాశవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి/ పాట్నా, జూలై 27: బిహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన నితీశ్‌కుమార్ ఓ పచ్చి అవకాశవాది అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఇక్కడ దుమ్మెత్తిపోశారు. తనను భ్రష్ఠుపట్టించడమే లక్ష్యంగా నితీశ్ పని చేస్తున్నారని, ఆయన బిజెపితో చేతులు కలపడానికి ప్రధాన కారణం తనపైన, కుటుంబ సభ్యులపైన, ఆర్జేడీ నేతలపైన సిబిఐ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగేలా చూడటానికే అన్నారు. బిజెపి, జెడి(యు)ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీశ్‌కుమార్ ఆ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చారన్నారు. ఇదంతా ఆర్జేడీకి వ్యతిరేకంగా పథకం ప్రకారం సాగిన గేమ్ అన్నారు. నితీశ్ బిజెపిని వ్యతిరేకించటం డ్రామా అని దుయ్యబట్టారు. నితీశ్ ఓ అవకాశవాది అని ధ్వజమెత్తిన లాలూ, రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బిహార్ ప్రజలు నితీశ్‌కు అధికారాన్ని కట్టబెట్టడానికి కారణం మతతత్వ శక్తులను వ్యతిరేకించడమేనని చెప్పిన లాలూ, నితీశ్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని దారుణ ద్రోహంగా అభివర్ణించారు. 2015 ఎన్నికల్లో సొంతంగా గెలిచే బలం లేదని గ్రహించిన నితీశ్ తన సాయం కోరారని, అందుకే ఆయనకు మద్దతిచ్చామన్నారు. ఆర్జేడీ అవినీతిని ఎదుర్కోలేకే మహాకూటమి నుంచి తప్పుకుంటున్నామని నితీశ్ చెప్పడాన్ని తప్పుబట్టిన లాలూ ‘ఆయనెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి. ఆయనేమైనా సిబిఐ డైరెక్టరా? బిహార్ డిజీపీనా?’ అని ప్రశ్నించారు. ఆర్జేడీ నాయకులపైన, తన కుటుంబ సభ్యులపైన సిబిఐ, ఇడి దాడులు చేయించడమే నితీశ్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని తెలిపారు. తన కుమారుడికి క్లీన్‌చిట్ ఇచ్చిన లాలూ, అతడేతప్పూ చేయలేదని, ఒకవేళ తప్పు చేసివుంటే నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులే తప్ప నితీశ్ కాదన్నారు.
గవర్నర్ నిర్ణయంపై కోర్టుకెళ్తాం
సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా జెడి(యు), ఎన్డీయేలకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కోర్టుకెక్కుతామని, ప్రజా కోర్టులో తేల్చుకుంటామని రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ ప్రతినిధి మనోజ్ ఝా తెలిపారు. బిజెపి పన్నిన కుట్రను ప్రజలకు వివరిస్తామని, ఆ విధంగా న్యాయాన్ని కోరతామని స్పష్టం చేశారు. ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీహార్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉల్లంఘించిందని ఝా అన్నారు. జెడి(యు), ఎన్డీయేలను ఏ ప్రాతిపదికన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారంటూ గవర్నర్ నిర్ణయ సహేతుకతను ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అతిపెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఆహ్వానించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్ కుమార్‌ను ఆహ్వానించటం బొమ్మయ్ కేసు తీర్పు స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై ఏవిధంగా తదుపరి అడుగు వేయాలన్న అంశాన్ని ఆర్జేడీ శాసన సభాపక్ష సమావేశంలో నిర్ణయిస్తామన్నారు.

చిత్రం.. రాంచిలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న లాలూ