జాతీయ వార్తలు

గూడు చెదిరి.. గుండె పగిలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 31: కష్టాలన్నీ కలిసొస్తాయన్న చందంగా మారింది ముంబయికి చెందిన వినోద్ తక్ పరిస్థితి. బ్యాంకు లోను తీసుకుని కొన్న ఫ్లాట్ గతవారం కుప్పకూలి అందులో నివాసం ఉంటున్న తల్లి ప్రమీలా తక్ (55), వదిన అమృత తక్ (30), మూడునెలల పాప విరోనిక మృతిచెందారు. ఇప్పుడు లోను నెలసరి వాయిదా కట్టమని బ్యాంకువారి ఒత్తిడి.. ఎటూ పాలుపోని పరిస్థితిలో వినోద్ తక్ ఉన్నాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న వినోద్ తక్ ఏడు నెలల కిందట ముంబయి సిద్ధిసాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని నాలుగు అంతస్థుల భవనంలోని మూడవ అంతస్థులో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అందులో తన అన్న లలిత్ తక్, అతని భార్య, పాప, తల్లి ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటనలో తల్లి, వదిన, పాప మృతిచెందగా అన్న లలిత్ తక్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదం నుంచి వినోద్ కోలుకోక ముందే బ్యాంకు లోను వాయిదాను కట్టాల్సిన తేదీ వచ్చేసింది. అయిన వారిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు లోన్ బకాయి ఎలా తీర్చాలో అర్థం కావటం లేదని వినోద్ వాపోతున్నాడు. రూ.50 లక్షలు వెచ్చించి కొన్న ఫ్లాట్ నేలపాలైంది, కన్నతల్లి, నా అన్నవాళ్లు మట్టిలో కలిసిపోయారు, లేని ఇంటికి డబ్బు ఎలా కట్టాలి? ఎందుకు కట్టాలి? అన్న సందిగ్దంలో వినోద్ ఉన్నాడు. బ్యాంకు అధికారులను కలిసి తన పరిస్థితిని విన్నవించుకుని సాయం చేయాల్సిందిగా కోరతానని వినోద్ తెలిపారు. ఏమి సాయం కోరాలో.. ఎటువంటి మినహాయింపు అడగాలో.. తెలియడం లేదని వినోద్ వాపోయాడు. కన్నతల్లి ప్రాణాలు, తోడబుట్టినవాడి భార్య, కూతురును పోగొట్టుకున్న దుఃఖం ఓ వైపు.. 50 లక్షలు విలువచేసే ఇల్లు భూస్థాపితమై నిలువ నీడ లేదన్న ఆవేదన మరో వైపు.. వెరసి కష్టంమీద కష్టంతో దిక్కుతోచని వినోద్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈ నెల 25న నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన సంఘటనలో మొత్తం 17 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం మంజూరు చేసింది. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించారు. అయితే ఉన్న గూడు చెదిరి తలదాచుకోడానికి నీడలేక విలవిల్లాడుతున్న బాధిత కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న శివసేన కార్యకర్త షితాప్ రినోవేషన్ పనులు చేయిస్తుండడంవల్లనే పిల్లర్లు దెబ్బతిని నాలుగు అంతస్థుల భవంతి కుప్పకూలిందన్న అభియోగాలున్నాయి. ఈ మేరకు పోలీసులు షితాప్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

చిత్రం.. ముంబయలోని ఘట్కోపర్‌లో ఇటీవల కూలిన భవనం. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది (ఫైల్ ఫొటో)