జాతీయ వార్తలు

విప్ జారీ చేసినా సభ ఎగ్గొడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాజ్యాంగ హోదాతో కూడిన వెనుకబడిన కులాల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన సవరణ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు గైర్హాజరైన పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలు, మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవచ్చునని షా బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసోంలోని వరద ముంపు ప్రాంతాలను చూసేందుకు వెళ్లడంతో అమిత్ షా మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజ్యసభలో సోమవారం సాయంత్రం బిసి జాతీయ కమిషన్‌ను ఏర్పాటుకు సంబంధించిన బిల్లు చర్చకు వచ్చినప్పుడు దాదాపు 30 మంది బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు సభలో లేరు. విప్ జారీ చేసిన తరువాత కూడా ఇంతమంది ఎంపీలు సభకు గైర్హాజరు కావటంతో బిల్లు వీగిపోయింది. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ ఆయన బిజెపి ఎంపీలు, మంత్రులపై మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు అకారణంగా గైర్హాజరు కాకూడదని గతవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ్యులకు హితవు చెప్పారు. ‘ప్రధాన మంత్రి చెప్పినా మీరు వినటం లేదు. విప్ జారీచేసినా సభకు హాజరు కావటం లేదు.. ఇక మీదట ఇలాంటివి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలుంటాయి’ అని అమిత్ షా హెచ్చరించారు. రాజ్యసభకు గైర్హాజరైన ఎంపీలు, మంత్రులతో విడిగా చర్చలు జరుపుతానని ఆయన ప్రకటించారు. ‘మీరు గైర్హాజరు కావటం వలన ప్రతిపక్షం బిసి జాతీయ కమిషన్ బిల్లుకు ముఖ్యమైన సవరణ చేయించగలిగింది. ఈ సవరణ మూలంగా జాతీయ కమిషన్ ఏర్పాటు తాత్కాలికంగా ఆగిపోవటంతోపాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది’ అని ఆయన అన్నారు. రాజ్యాంగ హోదాతో కూడిన కమిషన్ ఏర్పాటు మరింత ఆలస్యం కావటంపట్ల దేశంలోని కోట్లాది మంది బిసిలకు బాధ పడుతున్నారని షా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు, ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. బిసిలకు రాజ్యాంగ హోదాతో కూడిన జాతీయ కమిషన్ ఏర్పడటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే అవసరం లేని సవరణ చేసి బిల్లుకు ఆమోద ముద్ర పడకుండా కుట్ర చేసిందని బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఏకగ్రీవంగా బిసి బిల్లును ఆమోదించినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో ఎందుకు సవరణలు ప్రతిపాదించారని ఆయన నిలదీశారు.
కాగా సమావేశాలకు ఎందుకు రాలేకపోయిందీ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని షా ఆదేశించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ విప్‌ను సభ్యులు ధిక్కరిస్తే సహించేది లేదని హెచ్చరించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ వెల్లడించారు.

చిత్రం.. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.
చిత్రంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ తదితరులు