జాతీయ వార్తలు

గోరఖ్‌పూర్ పిక్నిక్ స్పాట్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం రాహుల్ గాంధీ గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కూర్చుని ఉండే యువరాజు గోరఖ్‌పూర్‌ను పిక్నిక్ స్పాట్‌గా చేసుకోవడానికి అనుమతించేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. అదే తరుణంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌పైన కూడా ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు. ‘లక్నోలో కూర్చున్న హెహజాదాకు, ఢిల్లీలో కూర్చున్న యువరాజుకు స్వచ్ఛత ఉద్యమం ప్రాధాన్యత ఏమి తెలుసు? గోరఖ్‌పూర్‌ను పిక్నిక్ స్పాట్ చేసుకోవడం కోసమే వాళ్లు ఇక్కడికి వస్తున్నారు. దాన్ని మేము అనుమతించం’ అని ఆయన అన్నారు. మెదడు వాపు వ్యాధి కారణంగా గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి ఆస్పత్రిలో 71 మందికి పైగా చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్యమంత్రి శనివారం ‘స్వచ్ఛ ఉత్తరప్రదేశ్-స్వాస్థ్య ఉత్తరప్రదేశ్’ పేరుతో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పట్టణంలో ప్రారంభించారు. ‘గోరఖ్‌పూర్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ఎవరైనా బహిరంగ సవాలు విసిరితే ప్రజలను చైతన్య పరచడం ద్వారా ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై పోరాడడానికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.
స్వచ్ఛతా కార్యక్రమం మెదడువాపు వ్యాధిని అదుపు చేయడంలో విజయవంతం అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనంకోసం రాష్ట ప్రజలకు వౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైందని అన్నారు. మెదడువాపు వ్యాధికి చికిత్స అందించడంకన్నా కూడా ఆ వ్యాధి వ్యాప్తిని అదుపు చేయడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, రక్షిత మంచినీరులాంటి తగిన రక్షణలు తీసుకోవడం మంచిదని, ఈ దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రోజు చేపట్టిన స్వచ్ఛతా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని లోక్‌సభలో గోరఖ్‌పూర్‌కు నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆదిత్యనాథ్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక నెల తర్వాత పట్టణంలో అత్యంత స్వచ్ఛంగా ఉండే వార్డుకు అవార్డు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. పరిశుభ్రత విషయంలో పోటీ ఉంటే మెదడువాపు వ్యాధి దానికదే అంతమవుతుందన్నారు. పట్టణంలోని అందియారి బాగ్‌లో స్వయంగా చీపురు పట్టి వీధులను ఊడ్చడం ద్వారా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కాగా, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన చౌకబారుతనాన్ని, రాహుల్ పర్యటన పట్ల భయాన్ని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది. గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో చిన్నారుల మరణాలకు బాధ్యులపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యా తీసుకోలేదని, సమస్యను పక్కదారి పట్టించడానికి యత్నిస్తున్నారని ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ అన్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో ముఖ్యమంత్రి తన పదవి హుందాతనాన్ని దిగజార్చుతున్నారని అన్నారు. నిరుపేదల బాధను పంచుకోవడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని, అయితే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించడం ద్వారా ముఖ్యమంత్రి ఆయన రాకపై ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని రాజ్‌బబ్బర్ అన్నారు. అఖిలేశ్ యాదవ్ సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ శుష్క వాగ్దానాలు, చౌకబారు ప్రకటనలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారని, ఇలాంటి వాటివల్ల రాష్ట్రంలో స్వచ్ఛంగా ఆరోగ్యంగా తయారవుతుందా? అని ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.