రాష్ట్రీయం

తమిళనాడులో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 16: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరునల్వేలి జిల్లా పాల్యంకొట్టి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన 26 మంది సహా ప్రకాశం జిల్లా నుంచి మరికొందరు ఈ నెల 12న కావేరీ నది పుష్కర స్నానాలు చేసి కన్యాకుమారి వెళుతూ శనివారం తెల్లవారుఝామున 4.30 గంటలకు తమిళనాడు తిరునల్వేలి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును నిలిపారు. అదే సమయంలో అటుగా వస్తున్న సిమెంట్ లోడు లారీ ట్రావెల్స్ బస్సును ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం అనంతవరం, ఈపూరు గ్రామాలకు చెందిన కె రత్నమాణిక్యం(63), జి నాగవర్ధని(45), డి వెంకటరమణ(65), రామకోటి(65), సత్యం(55) మృతుల్లో ఉన్నారు. ఈపూరుకు చెందిన దేసు సుధానారాయణ, వి సముద్రయ్య, మల్లికార్జునరావు, డి వరలక్ష్మి, అనంతవరం గ్రామానికి చెందిన జి హరేకృష్ణ, తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు పాల్యంకొట్టి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా కలెక్టర్ శశిధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కొల్లూరు తహశీల్దార్ ఎ శేషగిరిరావు, ఎస్‌ఐ అశోక్‌కుమార్ విమానం ద్వారా రాత్రి సమయానికి దుర్ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు జిల్లా రెవిన్యూ అధికారి కె నాగబాబు ఆధ్వర్యంలో గుంటూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన అనంతరం జిల్లాకు పంపాల్సిందిగా కలెక్టర్ తమిళనాడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలతో పాటు రవాణా, ఇతర ఏర్పాట్లు చేయాలని, మృతదేహాలను జిల్లాలోని వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక అంబులెన్స్ సదుపాయం కల్పించేలా తమిళనాడు అధికారులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చిత్రాలు..పాల్యంకొట్టి పాలిటెక్నిక్ కళాశాల వద్ద దుర్ఘటనా స్థలిలో చెల్లాచెదురుగా మృతదేహాలు