జాతీయ వార్తలు

అలజడులే వారి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 22: కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత బలగాలు ఆధిపత్యం సాధించాయని ప్రభుత్వం ఒకపక్క ప్రకటనలు చేస్తుంటే పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాజకీయ కార్యకర్తలు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరుపుతున్న వరుస దాడులే ఇందుకు తాజా ఉదాహరణ. 24 గంటల వ్యవధిలో అధికార పిడిపికి చెందిన ఇద్దరు శాసనసభ్యుల ఇళ్లపై ఉగ్రవాదులు దాడులు జరిపి బలగాలకు సవాలు విసిరారు. గత గురు, శుక్రవారాల్లో జరిపిన ఈ వరుస దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా భద్రతా వలయంలో ఉన్నవారిపైనా దాడులకు వెనుకాడబోమనే బలమైన సందేశాన్ని, సవాలును విసిరినట్టయింది. గత మంగళవారం పిడిపి కార్యకర్తను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు అంతటితో ఆగకుండా సుమారు 200మంది మద్దతుదారులతో వచ్చి అతని ఇంటిని అగ్నికి ఆహుతి చేశారు. ఇంతకాలం అడపా దడపా దాడులతో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలు సరికొత్త పంథాను ఎంచుకున్నారనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. భద్రతా దళాలపై ఒకపక్క దాడులు చేస్తూనే మరోపక్క పోలీసులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయడమే కాకుండా వారి కుటుంబాలను కూడా ఉగ్రవాదులు లక్ష్యం చేసుకోవడం కాశ్మీర్‌లో క్రమంగా వేళ్లూనుకుంటున్న తాజా పరిణామం. ఈ రకమైన దాడులకు దక్షిణ కాశ్మీర్ కేంద్ర బిందువుగా మారింది. కుల్గామ్, షోపియాన్, పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాలో ఈ రకమైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకే ఎమ్మెల్యేల ఇళ్లపై ఉగ్రవాదులు దాడులు జరిపారని బిజెపి నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించడం దాడుల తీవ్రతకు అద్దం పడుతోంది. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తాయని, ఈ శక్తులను నిలువరించేందుకు బలగాలు తమ వంతు కృషి చేస్తున్నాయని నిర్మల్‌సింగ్ పేర్కొన్నారు. కాగా, దాడులకు పూనుకుంటున్న ఉగ్రవాదులను, శక్తులను ఏరివేసేందుకు బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం, మద్దతు లభిస్తోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. దక్షిణ కాశ్మీర్‌లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు 150కిపైగా ఉగ్రవాదులు హతమైనా, కీలక కార్యకలాపాలు నిర్వహించే ఉగ్ర ముఠాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. 150మందిలో కేవలం 70మంది నియంత్రణ రేఖవద్ద పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నిస్తూ మరణించారని పేర్కొన్నారు. ఉగ్ర కార్యకలాపాలు పెరిగిపోవడానికి స్థానికుల సహకారమేనని, భారత బలగాలు తీసుకుంటున్న చర్యలకు విఘాతంగా మారుతోందన్నారు.

ఉగ్రమూకల దాడిలో దగ్ధమైన పిడిపి కార్యకర్త ఇల్లు (ఫైల్ ఫొటో)