జాతీయ వార్తలు

దీపిక ముక్కు కోస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 16: హిందీ చలనచిత్రం ‘పద్మావతి’లో అభ్యంతరక సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు తమ స్వరాన్ని రోజురోజుకూ మరింతగా పెంచుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను విడుదల చేస్తే సహించేది లేదని రాజస్థాన్‌కు చెందిన ‘కర్ని సేన’ గురువారం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. వచ్చే నెల ఒకటవ తేదీన ‘పద్మావతి’ విడుదల కాకుండా అడ్డుకుంటామని ఈ ‘సేన’ మరోసారి స్పష్టం చేసింది. ‘రాజపుత్ వంశస్థులు ఎప్పుడూ మహిళలపై చేయిచేసుకోరని, అయితే- ‘పద్మావతి’పై తమ నిరసన తెలిపేందుకు నటి దీపిక ముక్కు కోసి ఆమెను మరో ‘శూర్పణఖ’ మాదిరి చేస్తామని ‘కర్ని సేన’ అల్టిమేటం ఇచ్చింది. ‘మేం లక్షల సంఖ్యలో గుమికూడతాం.. మా పూర్వీకులు రక్తంతో చరిత్రను లిఖించారు.. తప్పుడు కథనాలను మేం అంగీకరించం.. డిసెంబర్ 1న భారత్ బంద్‌ను చేపడతాం’ అని ఈ సంస్థ స్పష్టం చేసింది. రాణి పద్మిని జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘పద్మావతి’లో చరిత్రను వక్రీకరించారని, ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీతో రాణి పద్మిని ప్రేమ వ్యవహారం నడిపినట్లు చిత్రీకరించడాన్ని రాజపుత్ వంశస్థులు సహించరని ఆందోళనకారులు ప్రకటించారు.
కాగా, రాణి పద్మావతిని గౌరవ భావంతో చూసినట్లే ప్రతి మహిళ పట్ల మర్యాద చూపడం మన నైతిక ధర్మమని, ఒక నటిపట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా సరికాదని కేంద్ర మంత్రి ఉమా భారతి ‘ట్వీట్’ చేశారు. అయితే, బీజేపీకి చెందిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె మాత్రం ‘కర్నిసేన’ హెచ్చరికలపై ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ‘పద్మావతి’ సినిమా ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 17వ తేదీలోగా ప్రకటించకపోతే చిత్తోర్‌గఢ్ కోటకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటామని ‘కర్ని సేన’ రాజస్థాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగానే హెచ్చరించింది. ఆందోళనకారులు ఇప్పటికే ‘పద్మావతి’ ట్రైలర్‌ను అడ్డుకుంటూ కోట తదితర పట్టణాల్లో విధ్వంసం సృష్టించారు. ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ రక్తంతో సంతకాలు చేసి కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డుకు వినతిపత్రాలు పంపుతామని ఆందోళనకారులు హెచ్చరించారు. పద్మావతి కేవలం ఓ వర్గానికి చెందిన మహిళ కాదని, రాజస్థాన్‌కే గౌరవం తెచ్చిన స్ర్తిమూర్తి అని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, డబ్బు సంపాదన ధ్యేయంతోనే దీన్ని నిర్మించారని మరో మంత్రి కిరణ్ మహేశ్వరి అన్నారు. చరిత్రను వక్రీకరించి ఓ గొప్ప మహిళను అవమానపరిస్తే తాము సహించేది లేదని ఆమె ప్రకటించారు.

చిత్రాలు.. సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్న పద్మావతి చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ గురువారం అలహాబాద్‌లో సార్‌నాథ్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్న అఖిల భారతీయ క్షత్రియ మహాసభ కార్యకర్తలు.
*లక్నోలో పద్మావతీ చిత్రానికి సంబంధించిన వార్తాకథనాలను పత్రికలవారికి చూపుతున్న రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి