జాతీయ వార్తలు

జయలలిత నివాసంలో ఐటీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 18: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జయలలిత నెచ్చెలి, ప్రస్తుతం జైలులో ఉన్న వీకే శశికళ ఉపయోగించిన గదిలో, కార్యాలయ బ్లాక్‌లో శుక్రవారం రాత్రి తనిఖీలు ప్రారంభించినట్లు ఐటీ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి శనివారం తెలిపారు. తమ శాఖకు అందిన పక్కా సమాచారం మేరకు, శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు తమ శాఖకు చెందిన అధికారుల బృందం వేద నిలయంలోని జయలలిత వద్ద గతంలో సహాయకుడిగా పనిచేసిన పూన్‌గుండ్రన్ గదిని, రికార్డుల గదిని, శశికళ ఉపయోగించిన గదులను తనిఖీ చేశాయని ఆయన వివరించారు. వేద నిలయం ప్రాంగణం మొత్తాన్ని తనిఖీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ సోదాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఐటీ శాఖకు చెందిన పది బృందాలు మొత్తం 187 ప్రాంతాల్లోని శశికళ, ఆమె బంధువులకు చెందిన ఇళ్లపై ఇప్పటికే ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
అణచివేయడానికే సోదాలు: దినకరన్
రాజకీయంగా తమను అణచివేయడానికే ఐటీ శాఖ అధికారులు వేద నిలయంపై దాడులు చేశారని ఏఐఏడీఎంకే బహిష్కృత నేత దినకరన్ శనివారం ఆరోపించారు. పవిత్ర స్థలమైన వేద నిలయంలో ఐటీ దాడులను ముఖ్యమంత్రి వ్యతిరేకించకపోవడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ దాడులకు శశికళ కుటుంబమే కారణమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శిబిరం ఆరోపించింది. వేద నిలయంపై దాడులు విచారకరమని, అయితే వీటికి కారణం శశికళ కుటుంబమేనని రాష్ట్ర మంత్రి జయకుమార్ పేర్కొన్నారు. జయలలిత మేన కోడలు దీప కూడా ఈ దాడులకు శశికళ కుటుంబమే కారణమని ధ్వజమెత్తారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సందర్భంగా శశికళ మేనల్లుడు, జయ టీవీ సీఈఓ వివేక్ జయరామన్ అక్కడ ఎందుకు ఉన్నారని ఆమె ప్రశ్నించారు.

చిత్రాలు..పోయెస్ గార్డెన్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న ఏఐఏడిఎంకే (అమ్మ) పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.
*జయలలిత మేనకోడలు దీపను అడ్డుకుంటున్న పోలీసులు. *విలేఖరులతో మాట్లాడుతున్న జయ టీవీ సీఇవో వివేక్.