జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, నవంబర్ 19: నక్సల్స్ అణచివేతలో భాగంగా ఛత్తీష్‌గఢ్ సుకుమా జిల్లాలో కూంబింగ్ విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కోళ్ల వెంకన్న (43) ఆదివారం తెల్లవారుఝామున నక్సల్స్ ఏర్పాటుచేసిన మందుపాతర పేలడంతో మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన వెంకన్న సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్‌లో హెచ్‌సీగా విధులు నిర్వహిస్తున్నారు. కూంబింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ ఏర్పాటుచేసిన మందుపాతరపై హెచ్‌సీ కాలు వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొన ఊపిరితో ఉన్న వెంకన్నను రాయపూర్ ఆసుపత్రికి హెలికాఫ్టర్‌లో తరలిస్తుండగా మృతిచెందినట్టు సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్టు ఎస్సై ఎస్ లక్ష్మణరావు తెలిపారు. వెంకన్నకు భార్య పద్మలీల, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసి, పొదలాడ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ దారుణం జరిగిందని తల్లిదండ్రులు కోళ్ల వెంకటనారాయణ, పార్వతిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి బ్యాంకు లోను కోసం రెండు రోజుల్లో వస్తానని చెప్పిన తమ కుమారుడు ఇలా మృతదేహమై రావడం పట్ల వారు విలపించే తీరు చూపరుల కంట కన్నీరుపెట్టిస్తోంది. మృతదేహాన్ని పొదలాడ తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, సోమవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఎస్సై తెలిపారు. 1990-91లో రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన వెంకన్న, 1996 సమయంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వివిధ ప్రాంతాలలో కానిస్టేబుల్‌గా సేవలందించిన వెంకన్న ఇటీవలె హెచ్‌సీగా పదోన్నతి పొందారు. పిన్న వయస్సులోనే దేశ రక్షణ బాధ్యతలు చేపట్టిన వెంకన్న ప్రాణాలు కోల్పోవడం రాజోలు ప్రాంతానికి తీరని లోటని పలువురు నివాళులర్పించారు.

హెడ్ కానిస్టేబుల్ వెంకన్న (ఫైల్ ఫొటో)