జాతీయ వార్తలు

ముమ్మాటికీ కరెక్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 22: అయోధ్యలో ఇరవై ఏడేళ్ల క్రితం కరసేవకులపై పోలీసు కాల్పులకు ఆదేశించడాన్ని అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సమర్థించుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదుపై దాడికోసం కరసేవకులు వెల్లువలా తరలివచ్చారు. ఆనాడు అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో కాల్పులకు ఆదేశించిడం సరైన చర్యేనని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం స్పష్టం చేశారు. దేశ సమగ్రత, సమైక్యతను పరిరక్షించడంకోసం అది తప్పనిసరి చర్యగా బుధవారం ఇక్కడ పేర్కొన్నారు. భద్రతాదళాలకు మరొక ప్రత్యామ్నాయం లేదని కూడా ఆయన అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ములాయం 79వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఓ సందేశాన్ని ఇస్తూ 1990 నాటి పరిస్థితులను గుర్తుచేశారు. ఆనాటి ఘర్షణల్లో మరింత మంది చనిపోయి ఉంటే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పువాటిల్లుతుందని భావించే గుంపులను చెదరగొట్టడానికి కాల్పులకు ఆదేశించాల్సి వచ్చిందని ములాయం అన్నారు. ఇది సరైన చర్యేనని ఆయన సమర్ధించుకున్నారు. 1990 అక్టోబర్ 30న అయోధ్యలో జరిగిన పోలీసు కాల్పుల్లో 28 మంది మృతి చెందారని మాజీ ముఖ్యమంత్రి ములాయం చెప్పారు. విశ్వ హిందూపరిషత్ పిలుపునందుకుని దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించాలని హిందూ సంస్థలు సంకల్పించాయి. అయితే ఆనాడు ములాయం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముస్లిం మైనారిటీ వర్గాలు హర్షించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ‘ముల్లా ములాయం’ అంటూ మారుపేరుతో పిలుచుకునేవారు. రాష్ట్ర జనాభాలో 20 శాతం వరకూ ముస్లింలున్నారు. ‘ఆనాడు ముస్లింలూ ఆయుధాలతో ఆ ప్రాంతానికి వస్తే దేశం పరిస్థితి ఏమయ్యేది?’ అని ములాయం ప్రశ్నించారు. బాబ్రీ మసీదును పరిరక్షించాలి, అలాగే శాంతిని నెలకొల్పాన్న సదుద్దేశంతోనే తన ప్రభుత్వం పోలీసు కాల్పులకు ఆదేశించినట్టు ఎస్‌పినేత స్పష్టం చేశారు. ‘పోలీసు కాల్పుల్లో 56 మంది చనిపోయారని మాజీ ప్రధాని ఏబీ వాజపేయి అన్నారు. దానిపై మా ఇద్దరి మధ్య తీవ్ర చర్చే జరిగింది’ అని ఆయన తెలిపారు. అయితే మృతుల సంఖ్య 28 మందేనని తాను వాదించినట్టు ములాయం గుర్తుచేశారు. ఆర్నెల్ల తరువాత తాను చెప్పిందే నిజమైందని ఆయన పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ముస్లింల మద్దతు ఇప్పటికీ తమకే ఉందని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేస్తున్నారని ఆయన తెలిపారు.