జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు జైకొట్టిన పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, నవంబర్ 22: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ‘పటీదార్ కోటా ఉద్యమ నేత’ హార్దిక్ పటేల్ ఎట్టకేలకు బుధవారం ప్రకటించారు. ఎన్నికల్లో గెలిస్తే పటేల్ సామాజిక వర్గానికి ‘ప్రత్యేక కేటగిరీ’ కింద రిజర్వేషన్ల సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. తమ కులస్థులకు ఈ సౌకర్యం కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి రిజర్వేషన్లు 50 శాతాన్ని మించవచ్చని అన్నారు. అయితే, రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వివరాలు ఉంటాయని ‘పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి’ (పాస్) నేత అయిన హార్దిట్ పటేల్ అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల విషయమై సమగ్ర సర్వే జరుగుతుందని, అసెంబ్లీలో ప్రత్యేక బిల్లును ప్రవేశ పెడతారని ఆయన వివరించారు. ఎన్నికల్లో బీజేపీపైనే తమ పోరాటం ఉంటుందని, కాంగ్రెస్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం గుజరాత్‌లో అమలులో ఉన్న 49 శాతం రిజర్వేషన్ల విధానానికి భంగం కలగకుండానే పటేల్ కులస్థులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు హార్దిక్ పటేల్ తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 (సి), ఆర్టికల్ 46 ప్రకారం విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన ప్రజల మేలుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని ఆయన వివరించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్నది సుప్రీం కోర్టు ఇచ్చిన ‘సలహా’ మాత్రమేనని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న ప్రస్తావన మన రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఈ సౌకర్యాన్ని 50 శాతానికి మించి కల్పించవచ్చని తాను ప్రగాఢంగా నమ్ముతున్నానని తెలిపారు.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం పట్ల తమకు ఎలాంటి వివాదం లేదన్నారు. ఫలానా సీట్లను కేటాయించాలని తాను అడగలేదని, తమ సామాజిక వర్గానికి వీలైనన్ని ఎక్కువ టెక్కెట్లు ఇవ్వాలని మాత్రమే కోరామన్నారు. ఎన్నికల్లో తమ కులం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారన్నారు. తమ సంస్థ తరఫున నామినేషన్లు వేసిన వారికి 50 లక్షల రూపాయల చొప్పున ముట్టజెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 9, 14 తేదీల్లో పోలింగ్ జరిగే గుజరాత్ ఎన్నికలను కాంగ్రెస్, బేజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.