జాతీయ వార్తలు

మన్మోహన్, అన్సారీలకు మోదీ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గుజరాత్ ఎన్నికల్లో బేజేపీని ఓడించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పాకిస్తాన్‌తో చేతులు కలిపారంటూ ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆమోద యోగ్యం కాని వ్యాఖ్యలు చేస్తున్న మోదీ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ సోమవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మోదీ తీవ్ర నిరాశకు లోనై ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో విలువలను పెంచేందుకు మోదీ ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకుని మన్మోహన్‌కు, అన్సారీకి క్షమాపణలు చెప్పాలన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ అధికారులను రహస్యంగా కలుసుకుని, గుజరాత్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని కోరినట్లు మోదీ ఆదివారం ఎన్నికల ప్రచారసభలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆనంద్ శర్మ ఖండిస్తూ, ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మోదీ విస్మరించరాదన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలను, కులపరమైన వివాదాలను లేవనెత్తే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదన్నారు. ఓటర్ల సానుభూతిని పొందేందుకు తనను ఓ బాధితుడిగా అభివర్ణించుకుంటూ మోదీ రాజకీయాల్లో విలువలను మంటగలుపుతున్నారని శర్మ విమర్శించారు. సామాజిక ప్రయోజనంకోసం పాకిస్తాన్ అధికారులను వివిధ వర్గాల ప్రముఖులు కలిసినపుడు రాజకీయాలను ఆపాదిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారని, దీన్ని రహస్య సమావేశం అనడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఏర్పాటుచేసిన ఆ సమావేశంలో భారత ఆర్మీ మాజీ అధిపతి, పాక్‌లో పనిచేసిన మాజీ రాయబారులు, ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారని గుర్తుచేశారు. ప్రముఖులు ఇలా కలుసుకోవడం నేరమా? విందుకు హాజరైనపుడు కూడా అనుమతి తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. రైతులు, ఉపాధి, యువత, అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించకుండా, కాంగ్రెస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేసేందుకే మోదీ మొగ్గు చూపుతున్నారని విమర్శించారు.