జాతీయ వార్తలు

అనూహ్యం.. దిగ్భ్రాంతికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ మీడియాతోమాట్లాడడం అన్నది దేశ చరిత్రలోనే అనూహ్యమైన పరిణామమని, దిగ్భ్రాంతికరమని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పరిణామాన్ని ప్రమాద సంకేతంగా పేర్కొంటున్నాయి. న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి అనేక అంశాలు వెల్లడించడం వెనక చాలా బలమైన కారణాలే ఉండి ఉంటాయని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై అనేక సందేహాలు తలెత్తడానికి ఆస్కారం ఉందని వెల్లడించారు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టడం, న్యాయవ్యవస్థలో ఏదీ సవ్యంగా లేదని చెప్పడం చాలా దిగ్భ్రాంతికరమైన అంశమని సీనియర్ అడ్వొకేట్ కేటీఎస్ తులసీ, మాజీ మంత్రుల సల్మాన్ ఖుర్షీద్, అశ్వినీ కుమార్, మాజీ న్యాయమూర్తులు ఆర్‌ఎస్ సోభీ, ముకుల్ ముద్గల్ వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది ఇంద్రాజైసింగ్ మాత్రం దీన్ని శుభపరిణామంగా పేర్కొంటూ నలుగురు న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు. నలుగురు సీనియర్ జడ్జిలు మీడియా ముందుకు వచ్చి న్యాయవ్యవస్థ లోపాలను ఎండగట్టారంటే కచ్చితంగా వారి ఆందోళన వెనక కారణం ఉండి ఉంటుందని పేర్కొన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ‘వీరి చర్యను తప్పుపట్టడం కాదు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి’ అని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకుని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, నలుగురు న్యాయమూర్తులను పిలిచి మాట్లాడి సంప్రదింపులు ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించారు.
జస్టిస్ సోభీ మాత్రం న్యాయమూర్తులు తీరును తప్పుపట్టడమే కాకుండా మీడియా సమావేశాల ద్వారా న్యాయాన్ని అందిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ణయించాల్సింది పోయి మీరే చెప్పడంటూ ప్రజలకు వొదిలేస్తారా?అని నిలదీశారు. ఈ నలుగురు న్యాయమూర్తులు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేసి ఉంటారని, కచ్చితంగా వారు ప్రచారం కోసమే ఈ పనిచేసిన ఉండరని జస్టిస్ ముద్గల్ అన్నారు.
న్యాయమూర్తుల చర్యను గతంలో ఎన్నడూ జరగని దిగ్భ్రాంతికర పరిణామంగా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభివర్ణించారు. ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించే ఈ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారంటే కచ్చితంగా పరిస్థితి అదుపుతప్పి ఉంటుందని ఆయన అన్నారు. అన్ని రకాలుగా పరిష్కార మార్గాలు అడుగంటిపోయిన తరువాతే నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి ఉంటారని సీనియర్ లాయర్ తులసీ స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి ఇదో దుర్దినం అని మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం అత్యున్నత న్యాయస్థానం విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చిందని చెప్పారు.

చిత్రం..తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అభివాదం చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్