జాతీయ వార్తలు

రాజీకి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకుర్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు తెరవెనక చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు ఆటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా మరికొందరు సీనియర్ అధికారులు, న్యాయవాదులు ఇరుపక్షాలతో తెరవెనక చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. నరేంద్ర మోదీ సలహా మేరకు నృపేంద్ర మిశ్రా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నివాసానికి వెళ్లి ముఖాముఖి చర్చలు జరిపారు. మరోవైపు అటార్నీ జనరల్ వేణుగోపాల్ మరికొందరు సీనియర్ న్యాయాధికారులు నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో చర్చల ప్రక్రియ ప్రారంభించినట్లు చెబుతున్నారు. సీజే దీపక్ మిశ్రాపై తిరుగుబాటు జెండా ఎగురువేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులలో ముగ్గురు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లేరు. వారు దేశ రాజధానికి తిరిగి రాగానే సీజే దీపక్ మిశ్రాతో ముఖాముఖీ
సమావేశం ఏర్పాటుచేసి పరిస్థితులను చక్కదిద్దేందుకు యుద్ధప్రాతిపదికపై సంప్రదింపులు జరుగుతున్నాయి. సోమవారం నాటికి ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య రాజీ కుదిరే అవకాశాలున్నాయని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పటం గమనార్హం. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తావించిన మూడు ముఖ్యమైన అంశాలపై రాజీ కుదిరే అవకాశాలున్నాయనే విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జస్టిస్ లోయ మరణంపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చునని అంటున్నారు. దీనితోపాటు ముఖ్యమైన కేసులపై విచారణ జరిపేందుకు ఎవరికి కేటాయించాలనే అంశంపై ఇరుపక్షాల మధ్య ఒక రాజీ సూత్రాన్ని తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సంతృప్తి కలిగించే విధంగా ఈ రాజీ సూత్రం ఉంటుందని అంటున్నారు. సుప్రీం కోర్టులో ఏకఛత్రాధిపత్యం కొనసాగింపుకు తెర దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు పని తీరు మూలంగా ప్రజాస్వామ్యానికే ప్రమాదం ముంచుకు వస్తోందంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చేసిన ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తీసుకున్నారని అంటున్నారు. నలుగురు న్యాయమూర్తులు పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన అంశాలపై కాంగ్రెస్, వామపక్షాలు స్పందించటంతోపాటు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా పరిగఘణించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయటం తెలిసిందే. నలుగురు న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలను కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నందున ఈ వివాదానికి వీలున్నంత త్వరగా తెరదించాలని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తమ అసంతృప్తిని మీడియాద్వారా ప్రజల ముందు పెట్టడం తీవ్రమైన అంశంగా మారింది. సీనియర్ న్యాయమూర్తుల మధ్య ఉన్న వివాదాల మూలంగా సుప్రీం కోర్టు పట్ల ప్రజల విశ్వాసం మరింత సన్నగిల్లే ప్రమాదం ఉన్నదని కేంద్ర న్యాయ శాఖ భావిస్తోంది. సుప్రీం కోర్టుతోపాటు దేశంలోని న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకు మంచి అభిప్రాయం లేదు. న్యాయ వ్యవస్థ అవినీతిమయంగా మారిందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. దేశ ప్రజలకు రాష్టస్థ్రాయి న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం లేకపోయినా సుప్రీం కోర్టు పట్ల కొంత విశ్వాసం కొనసాగుతోందనీ, ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం మూలంగా సుప్రీం కోర్టు పట్ల ప్రజలకు ఉన్న కాస్తంత విశ్వాసం, నమ్మకం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని కేంద్ర న్యాయ శాఖ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో దీపక్ మిశ్రాకు నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదాన్ని వీలున్నంత త్వరగా పరిష్కరించి సుప్రీం కోర్టులో సామాన్య పరిస్థితులను నెలకొల్పాలన్నది మోదీ ప్రభుత్వం ఆలోచన.
ప్రధాని వివరణ ఇవ్వాలి
ప్రధాన మంత్రి ముఖ్యకార్యదర్శి నృపేందర్ మిశ్రా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను ఆయన నివాసంలో కలుసుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. దీపక్ మిశ్రాతో నృపేంద్ర మిశ్రా జరిపిన చర్చల వివరాలు ఏమిటి? అని ఆయన అడిగారు. ఇదిలా ఉంటే దీపక్ మిశ్రా నివాసానికి వెళ్లిన తాను ఆయనను కలుసుకోలేదు, ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారమని నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.