జాతీయ వార్తలు

ఆప్ ఎమ్మెల్యేలపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 19: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఇరవై మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్నికల సంఘం సంచలనాత్మకంగా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్టప్రతి ఆమోదిస్తే ఈ ఎమ్మెల్యేలందరూ ‘మాజీ’లుగా మారిపోతారు. 20 మంది ఆప్ శాసనసభ్యులు పార్లమెంటరీ కార్యదర్శులుగా పనిచేస్తూ ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ నియమాన్ని ఉల్లంఘించారని ఎన్నికల సంఘం పేర్కొంది. లాభదాయకమైన పదవుల్లో ఉన్న వీరిని శాసనసభకు అనర్హులుగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన పూర్వపరాలిలా ఉన్నాయి. ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది 2015లో అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన ఫిర్యాదులో ఇరవై ఒక్క మంది శాసన సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పార్లమెంటరీ
కార్యదర్శులుగా నియమించటాన్ని ప్రశ్నించారు. లాభదాయక పదవుల్లో ఉంటూ నిబంధనలను ఉల్లంఘించినందున వీరిని అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి విచారణ జరిపిన అనంతరం తగు సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం విచారణ జరిపిన అనంతరం, 21 మంది ఎమ్మెల్యేలలో 20 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్టప్రతికి సిఫార్సు చేసింది. ఆప్ ఎమ్మెల్యేగా ఉంటున్న జర్నేల్ సింగ్ గత ఏడాది ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసి, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో విచారణ పరిధి నుంచి ఆయనను మినహాయించారు.
కాగా, 20 మంది ‘ఆప్’ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న ఈసీ సిఫార్సును రాష్టప్రతి ఆమోదించినా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ శాసనసభలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బలం 67. 67 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది పదవులను కోల్పోయినప్పటికీ కేజ్రీవాల్ సర్కారుకు ఎలాంటి ముప్పు ఉండదు. అయితే- అధికారంలో కొనసాగే నైతిక హక్కును కేజ్రీవాల్ ప్రభుత్వం కోల్పోతుంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించాక, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇరవై ఒక్క మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. వీరికి మంత్రులతో సమానంగా కార్యాలయం, కారు, ఇతర సౌకర్యాలు కల్పించారు. 2015 జూన్‌లో ఢిల్లీ శాసన సభ్యుల (అనర్హత తొలగింపు) చట్టాన్ని కేజ్రీవాల్ సర్కారు సవరించి, పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ పరిధి నుండి తప్పించారు. అయితే అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 2016లో ఢిల్లీ ప్రభుత్వం పంపించిన ఈ సవరణ బిల్లును తిరస్కరించారు. ఇది జరిగిన అనంతరం ఢిల్లీ హైకోర్టు కూడా ఇరవై ఒక్క మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించటాన్ని కొట్టివేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ఢిల్లీ ప్రభుత్వం పంపించిన సవరణ బిల్లును తిరస్కరించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు 21 మంది పార్లమెంటరీ కార్యదర్శుల నియమకాన్ని కొట్టి వేసినప్పటి నుండి వారందరినీ అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. వేతనం, ఇతర సదుపాయాలను అనుభవిస్తున్న శాసనసభ్యులు పార్లమెంటరీ కార్యదర్శులుగా కూడా ఆర్థికంగా ప్రయోజనం పొందారన్నది న్యాయవాది ప్రశాంత్ పటేల్ వాదించారు. ఆయన వాదనను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించటంతో ఇరవై మంది శాసన సభ్యులు అనర్హతకు గురి అవుతున్నారు.