జాతీయ వార్తలు

శాంతిభద్రతల నిర్వహణ మా పని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: వివాదాస్పద హిందీ చలనచిత్రం ‘పద్మావత్’ ప్రదర్శనలను నిలిపివేసేలా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన ధ్రువీకరణను రద్దు చేయాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ‘పద్మావత్’ సినిమాను ప్రదర్శిస్తే ఆత్మహత్యలు, ఆస్తుల విధ్వంసం వంటి సంఘటనలు జరుగుతాయని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ‘పిల్’లో పేర్కొనడాన్ని సుప్రీం ధర్మాసనం కొట్టిపారేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రత నిర్వహణ తమ పని కాదని ధర్మాసనం ప్రకటించింది. ‘శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వానిదే.. అది మా పరిధిలోకి రాదు.. పిటిషన్‌దారుని అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం..’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ కీలకపాత్రల్లో నటించిన ‘పద్మావత్’ను నిలిపివేయాలని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్ట్ఫికెట్‌ను తక్షణం రద్దు చేయాలని న్యాయవాది శర్మ అభ్యర్థించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులను, సినిమాటోగ్రఫీ చట్టంలోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
‘గురువారం నాడే ఈ సినిమాకు సంబంధించి మేం సహేతుకమైన ఆదేశాలు జారీ చేశాం.. ఒకసారి సెన్సార్ సర్ట్ఫికెట్ మంజూరయ్యాక ఆ సినిమా విడుదలను అడ్డుకోలేం.. మేం జోక్యం చేసుకునే అవకాశమే లేదు..’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ సినిమాపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై ఆదేశాలు ఇవ్వడానికి వీలు లేదని కూడా న్యాయస్థానం పేర్కొంది. తాము ఎలాంటి నిషేధం విధించకపోయినప్పటికీ, ‘పద్మావత్’ ప్రదర్శనలకు అనుమించేది లేదని హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. పద్మావత్’ విడుదలైన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు, ఆ సినిమాకు పనిచేసిన వారందరికీ భద్రత కల్పించేందుకు, సినిమా హాళ్ల వద్ద ఘర్షణలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా, ‘పద్మావత్’ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ‘కర్ణిసేన’ కార్యకర్తలు ముజఫర్‌పూర్‌లోని ఓ థియేటర్ ప్రాంగణంలో విధ్వంసం సృష్టించారు. ‘పద్మావత్’ పోస్టర్లు తొలగించాలని వారు రాళ్లు రువ్వారు. పాట్నాలో ఒక మల్టీప్లెక్స్ తప్ప మిగతా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, సినిమా హాళ్ల వద్దకు ప్రేక్షకులు రాకుండా కట్టడి చేయాలని ‘కర్ణిసేన’ అధిపతి లోకేంద్ర సింగ్ కల్వీ తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సినిమా విడుదలను అడ్డుకోవాలని సామాజిక సంస్థలను ఆయన కోరారు. ప్రజలే స్వచ్ఛందంగా ఈ సినిమాను నిషేధించాలన్నారు. ‘పద్మావత్’ విడుదలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు తమ సంస్థ నాయకుల నేతృత్వంలో అత్యవసర సమావేశం జరుగుతుందని లోకేంద్ర సింగ్ తెలిపారు. సినిమాలో కొన్ని మార్పులు చేశామని, పేరును కూడా ‘పద్మావత్’గా మార్చామని నిర్మాతలు చెబుతున్నప్పటికీ, ఈ సినిమాను అడ్డుకుని తీరతామని ఆయన ప్రకటించారు.