జాతీయ వార్తలు

పొత్తుల ఎత్తులకు పదును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: లోక్‌సభ ఎన్నికలు మరో 15నెలల దూరంలో ఉడడంతో జాతీయ, ప్రాంతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాల రూపురేఖలు మారుతున్నాయి. లోక్‌సభతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎవరితో పోటీ చేయాలనే అంశంపై కొన్ని పార్టీలు అప్పుడే తమ నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటూ మిత్రపక్షమైన శివసేన ఏకంగా ఒక తీర్మాన ఆమోదించి అందరిని ఆశ్చర్యపరిస్తే, కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పనిచేయాలని సీపీఎం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేయకుండా స్వతత్రంగా ఎన్నికల బరిలోకి దిగాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ, మరో మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తీసుకున్న నిర్ణయాలు కూడా రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో కూడా కొత్త సమీకరణాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
2019లో జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు శివసేన మంగళవారం ప్రకటించింది. దీనితో బీజేపీ, శివసేన మధ్య ఎన్నో ఏళ్లనుండి కొనసాగుతున్న ఎన్నికల పొత్తు తెరపడినట్లయింది. బీజేపీ, శివసేన మధ్య చాలాకాలం నుండి వివాదం కొనసాగుతోంది. ముంబాయిలో జరిగిన జాతీయ కార్యవర్గం సమావేశంలో శివసేన ఈ నిర్ణయం తీసుకున్నది. శివసేన ఇకమీదట మహారాష్టత్రోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ హిందూత్వకోసం పోరాటం చేస్తుందని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు.
ఇలావుండగా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదని సీపీఎం గత ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశంలో తీర్మానించటం తెలిసింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మధ్య కొనసాగుతున్న విభేదాలు ఈ తీర్మానంతో రోడ్డెక్కాయి. 2019 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీతారాం ఏచూరి ఒక తీర్మానం ప్రతిపాదించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలపటం ఎంతో అవసరమని ఏచూరి వాదించారు. దీనికి ప్రతిగా కారత్ మరో తీర్మానం ప్రతిపాదిస్తూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమిని ఎదుర్కొనేందుకు వామపక్షాలు, కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పని చేయవలసిన అవసరం ఉన్నదని ప్రతిపాదించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమిని పకడ్బందీగా ఎదుర్కోవాలంటే ఇలాంటి కూటమి ఎంతో అవసరమని కారత్ వాదించారు. సెంట్రల్ కమిటీలో ఈ రెండు తీర్మానాలపై ఓటింగ్ జరగ్గా ప్రకాశ్ కారత్ ప్రతిపాదించిన తీర్మానం 55-31 ఓట్లతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు సీతారాం ఏచూరి తీర్మానానికి మద్దతిస్తే కేరళ యూనిట్‌తోపాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల యూనిట్లు ప్రకాశ్ కారత్ తీర్మానానికి మద్దతిచ్చాయి. సీపీఎం ఇప్పుడు వామపక్షాలు-కాంగ్రెస్ కూటమికి బదులు వామపక్షాలు-కాంగ్రెస్-ఇతర ప్రజాస్వామ్య శక్తులతో కూడిన కూటమిని ఏర్పాటు చేసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఎదుర్కొంటాయి.
ఇదిలాఉంటే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన సమాజ్‌వాదీ పార్టీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం, ఎస్పీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పొత్తు మూలంగా గందరగోళం నెలకొంటోంది, ఇది తమ పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే తాను రాష్ట్రంలో పాదయాత్ర చేపడతాని అఖిలేష్ ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని మాజీ కేంద్ర మంత్రి ములాయం సింగ్ యాదవ్ సైతం ప్రకటించటం కాంగ్రెస్‌ను మరింత నిరుత్సాహ పరిచింది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని ఆలోచిస్తోంది. కాంగ్రెస్ లేదా మరో ప్రతిపక్ష పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె గత వారం లక్నోలో చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వలన తమ పార్టీకి నష్టం కలుగుతోందని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు ఊపిరి పోసుకుంటున్న ఈ సమీకరణాలు ఇదేవిధంగా ఉండిపోకుండా కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఈ సమీకరణాలపై స్పష్టత వస్తుంది.