జాతీయ వార్తలు

అనుమతులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: తెలంగాణ నిర్మిస్తున్న దేవాదులు ప్రాజెక్టుకు క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్) కింద రూ.450 కోట్లు, భీమా ప్రాజెక్టుకు రూ.35 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని 99 సాగునీటి ప్రాజెక్టులను ఎంపిక చేసింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్యాప్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం క్యాడ్‌వామ్‌పై గురువారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన గురువారం రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హరీశ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పిఎంకేఎస్‌వై కింద 11 ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిలో రెండు ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసినట్టు చెప్పారు. మరో రెండు ప్రాజెక్టులను జూన్ 2018కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం మార్చి 2019నాటికి పూర్తి చేస్తామని కేంద్రానికి తెలియజేసినట్టు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిన నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు పేర్కొన్నారు. దేశంలో ఈ 99 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, అది నెరవేరాలంటే నాబార్డు నుంచి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తానని గడ్కరీ వెల్లడించినట్టు చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిధులతోపాటు నాబార్డు నుంచి కూడా ఈ ప్రాజెక్టులకు నిధులు మంజూరయితే, త్వరగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. క్యాడ్‌వామ్ కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి 11 ప్రాజెక్టులకుగాను రూ.1000 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి ఇచ్చినట్టు తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంకోసం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి అభినందించారని హరీశ్‌రావు వెల్లడించారు.
హర్షవర్థన్‌తో భేటీ
పాలమూరు ఎత్తిపోతల పథకానికి తొలి దశ అటవీ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. గురువారం హరీశ్‌రావు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన వన్యప్రాణి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై వన్యప్రాణి బోర్డు సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మొదటి దశకు పర్యావరణ అనుమతులు వచ్చాయని, వన్యప్రాణి అటవీ అనుమతులు కూడా వస్తే త్వరితగతిన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించినట్టు వెల్లడించారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తానని హర్షవర్థన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పర్యటనకు రావాలని కేంద్ర మంత్రిని కోరినట్టు హరీశ్‌రావు వెల్లడించారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులున్నారు.