జాతీయ వార్తలు

జలాలపై కుదరని రాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కృష్ణ, గోదావరి జల బోర్డుల పరిధిని నిర్ధారించే అంశంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలకు పరిష్కారం కుదరలేదు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ గురువారం ఆంధ్రా, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు, బోర్డు అధికారులతో సమావేశమై వాటి పని తీరును సమీక్షించారు. ఈ సమావేశంలో బోర్డుల పరిధిని నిర్ధారించే అంశంపై ఇరు పక్షాలు వాదన వినిపించాయి. కృష్ణ, గోదావరి జల బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు వాదించగా, తెలంగాణ అధికారులు మాత్రం రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేయటాన్ని గట్టిగా వ్యతిరేకించారు. మొదట రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను ఖరారు చేసిన తరువాతనే రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని తెలంగాణా స్పష్టం చేసింది.
బజాజ్ కమిటీని, దాని నివేదికను ఎందుకు నిర్వీర్యం చేశారని తెలంగాణ నీటి పారుదుల కార్యదర్శి జోషి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి కేటాయింపులో ఎంతో అన్యాయం జరిగింది, ఇప్పుడు దానిని సరిచేయవలసిన అవసరం ఉన్నదని ఆయన వాదించారు. మిగతా అన్ని ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీలు పని చేస్తున్నప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద టెలిమెట్రీ మాత్రం పని చేయటం లేదు, ఎందుకిలా జరుగుతోందని జోషి అడిగారు. గత సంవత్సరం ఎంత మొత్తం నీరు వాడుకున్నారనే లెక్కలు బైటపెట్టాలని జోషి డిమాండ్ చేశారు. గోదావరి నుండి కృష్ణా నదిలోకి మళ్లించే నీటిలో తెలంగాణకు వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
విభజన చట్టంలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరు కేటాయించాలని తెలంగాణ ఎలా అడుగుతుందని ఏపీ నీటి పారుదల కార్యదర్శి శశిభూషణ్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత చేపట్టిన ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవటం చట్ట విరుద్ధమని ఆయన వాదించారు. పోతిరెడ్డిపాడుకు కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడుకుంటున్నారంటూ చేస్తున్న వాదన నిజం కాదన్నారు. ఏపీ తమ పరిధికి లోబడే పోడిరెడ్డిపాడు నుండి నీటిని ఉపయోగించుకుంటోందని శశిభూషన్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం పోడిరెడ్డిపాడు నుండి దాదాపు ఇరవై టీఎంసీ జలాలను వాడుకున్నదని తెలంగాణ వాదించగా జూరాల నుండి తెలంగాణ 50టీఎంసీ జలాలను వాడుకుంటోందని ఏపీ అధికారులు ఆరోపించారు. పట్టిసీమ నుండి గోదావరి జలాలను తరలిస్తున్నందున కృష్ణా జలాలను ఉపయోగించుకునే అవకాశం తమకు ఉండాలని తెలంగాణ అధికారులు వాదించగా, గోదావరి నుండి నీటిని ఉపయోగించుకునే వెసులుబాటు ఉన్నందున దీని గురించి ఇక్కడ చర్చించవలసిన అవసరం లేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. పట్టిసీమ విషయంలో ట్రిబ్యునల్ నుండి ఆదేశం తెచ్చుకోవాలని ఆయన తెలంగాణకు సూచించారు. రెండు రాష్ట్రాల అధికారులు పలు అంశాలపై వాదోపవాదాలకు దిగటంతో రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేసే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. గోదావరిలో వాటర్ బ్యాలెన్స్‌ను అధ్యయనం చేయాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను విధిగా కేంద్ర జల సంఘం, రెండు బోర్డులకు అందజేయాలని కేంద్ర జల సంఘం కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.
45 టీఎంసీ ఇవ్వండి: హరీశ్‌రావు
రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరుగకుండా రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేయటం సాధ్యం కాదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు పెండింగ్‌లో ఉండగా కృష్ణా జల బోర్డు పరిధిలోకి నీటి పారుదల ప్రాజెక్టులను తీసుకురావటం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఏ మేరకు జలాలను కేటాయించారనేది తేలిన తరువాత బోర్డుల పరిధిని నోటిఫై చేయటం మంచిదని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఇలా చేసినప్పుడే బోర్డు తమ పరిధిలోని ప్రాజెక్టులను సమర్థవంతంగా నియంత్రించ గలుగుతుందని ఆయన అన్నారు. ఏ రాష్ట్రానికి ఎంత నీరు కేటాయించారనేది స్పష్టం కాకుండానే బోర్డు పరిధిలోకి నీటి పారుదల ప్రాజెక్టులను తీసుకురావటం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ నుండి గోదావరి నీటిని మళ్లిస్తున్నందున దీనికి బదులుగా తెలంగాణకు నీటి కేటాయింపు జరగాలి కదా? అని హరీశ్‌రావు అడిగారు. కృష్ణా నది నుండి తెలంగాణకు 45టీఎంసీ జలాలను ఇవ్వాలని ఆయన చెప్పారు. పట్టిసీమ గురించి మాట్లాడుతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి తమకు నీరు ఇస్తుందా అంటూ ఏపీ అధికారులు ప్రశ్నించటంపై హరీశ్‌రావు స్పందిస్తు ఒక నది నుండి మరో నదిలోకి నీరు తీసుకుపోయినప్పుడు వాటాల సమస్య వస్తుంది తప్ప ఒక నదీ పరీవాహక ప్రాంతంలోని నీటిని అక్కడే ఉపయోగించుకుంటే రాదు, ఆంధ్ర అధికారులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
నోటిఫై చేస్తేనే న్యాయం: దేవినేని
రెండు బోర్డుల పరిధిని నోటిఫై చేస్తేనే చివరన ఉన్న రైతులకు నీరు అందుతుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. చట్టంలో పొందుపరిచిన దానిని అమలు చేయాలని ఏపీ అధికారులు సూచించారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా రాష్ట్ర అవసరాలను పూర్తి చేసేందుకోసమే పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను చేపట్టామని ఆయన వివరించారు.

చిత్రం..ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ నిర్వహించిన రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమీక్షా సమావేశం