జాతీయ వార్తలు

మహిళా సాధికారతే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 24: కుటుంబ సంక్షేమానికి మహిళా సాధికారత ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మహిళల అభ్యున్నతి కోసం గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలులోకి తెచ్చిందని తెలిపారు. ‘మహిళలకు తమకాళ్లపై తాము నిలబడే రీతిలో సాధికారత కల్పిస్తే మొత్తం కుటుంబం శక్తివంతమవుతుంది. అలాగే మహిళలు విద్యావంతులైతే మొత్తం కుటుంబమే విద్యా సుగంధాలు సంతరించుకోగలుగుతుంది’అని అన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 70 జయంతి సందర్భంగా శనివారం ఇక్కడ ద్విచక్ర వాహనాల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘జయలలిత ఎక్కడ ఉన్నా మీ కళ్లలో ఆనందం చూసి మరింత ఆనందిస్తారు’అని మోదీ పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా మొదటి ఐదుగురు లబ్ధిదారులకు ద్విచక్ర వాహన తాళాలను, రిజిస్ట్రేషన్ పత్రాలను మోదీ అందించారు. సబ్సిడీ ద్విచక్ర వాహన పథకం జయలలిత కలల పథకమని, దాని ప్రారంభంలో పాలుపంచుకోవడం తనకు ఎంతో ఆనంద కలిగిస్తోందని మోదీ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభికుల హర్షధ్వానాల మధ్య తమిళంలో తన ప్రసంగం మొదలు పెట్టిన మోదీ విప్లవ కవి సుబ్రమణ్య భారతి పుట్టిన గడ్డపై అడుగు పెట్టినందుకు తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. సబ్సిడీతో అమలు చేస్తున్న ద్విచక్ర వాహన పథకంతో పాటు 70లక్షల మొక్కలు నాటాలన్న కార్యక్రమం మహిళా సాధికారత సాధన, పర్వావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. సామాన్యుల జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం ఎంతగానో కృషి చేస్తోందని, ఈ లక్ష్యంతోనే అనేక పథకాలను చేపట్టామని తెలిపారు. రైతుల చిన్న వ్యాపారాలకు సులభతరమైన పరపతి సౌకర్యం కల్పించామని, ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద 11 కోట్ల మందికి 4.60 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను అందించామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 70శాతం మంది మహిళలేనని గుర్తు చేశారు. శతాబ్దాల బంధనాలను తెంచుకుని భారత మహిళలు స్వయం ఉపాధి, సాధికారత దిశగా అడుగు వేస్తున్నారని చెప్పడానికి ఈ పథకం సాధించిన విజయమే నిదర్శనమన్నారు. స్టాడప్ ఇండియా పథకంలో భాగంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు పది లక్షల నుంచి కోటి రూపాయల వరకూ రుణాలు అందిస్తున్నామని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాత్రిళ్లూ మహిళలు కష్టపడుతున్నారని మోదీ తెలిపారు.

చిత్రం..లబ్దిదారులకు అమ్మ స్కూటర్లు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ