జాతీయ వార్తలు

మహిళా సాధికారత మనందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: మహిళలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిథ్యం కల్పించడం ప్రతి భారతీయుడి ప్రాథమిక బాధ్యతగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అభివృద్ధిలో మహిళా సాధికారత, సమాన భాగస్వామ్యం అన్నది ఆధునిక భారతావని స్వప్నమన్నారు. ప్రతి నెలా రేడియోలో ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు ప్రదర్శిస్తున్న మానసిక ధైర్యమే వాళ్లను సాధికారత దిశకు తీసుకెళ్తోందని ప్రశంసించారు. ‘ఆమె ఎదగడం కాదు. దేశం ఎదుగుతున్న వైనంలో ఆమె కృషి ఎంతో ఉంది’ అని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళాభివృద్ధి ఒక ఎత్తయితే, మహిళా నాయకత్వంలో దేశం సాధిస్తోన్న ప్రగతి మరో ఎత్తని మోదీ అన్నారు. ‘సామాజిక రంగం కావొచ్చు. ఆర్థిక రంగం కావొచ్చు. ఏ రంగంలోనైనా మహిళలకు ప్రాధాన్యత కల్పించడమన్నది భారతీయుల ప్రాథమిక బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. ‘నిజమైన మహిళాస్వామ్యమే నిజమైన స్వాతంత్య్రమంటూ స్వామి వివేకానంద వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘మగాడికి గుర్తింపు మహిళవల్లే దక్కిందన్న నీతి మన సంస్కృతిలోనే ఉంది. యశోద కొడుకు (కృష్ణుడు), కౌశల్య కుమారుడు (రాముడు), గాంధారి పుత్రుడు (దుర్యోధనుడు)... కొడుకులుగా వాళ్లకున్న గుర్తింపు తల్లితోనే’ అన్నారు.
ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోనున్నామని గుర్తు చేస్తూ, అలుపెరుగని తపనే శాస్త్ర ఆవిష్కరణలకు దోహదమవుతుందని అన్నారు. అలాగే మార్చిన 4న నిర్వహించుకోనున్న జాతీయ భద్రతా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రమాదాలు చెప్పిరావని అంటూ, భద్రత విషయంలో జాగరూకతతో లేకుంటే సంభవించే నష్టాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు. ‘ప్రకృతి వైపరీత్యాలను పక్కనపెడితే, చాలావరకూ నష్టాలు మానవ తప్పిదాలుగానే కనిపిస్తున్నాయి. మనకోసం విధించుకున్న నిబంధనలను మనమే ఉల్లంఘించడం వల్లే తలెత్తే ప్రమాదాలే ఇవి. మనం జాగరూకతతో వ్యవహరిస్తే మన ప్రాణాలే కాదు, సమాజానికి జరిగే నష్టాన్నీ నివారించొచ్చు’ అని మోదీ స్పష్టం చేశారు. కొనే్నళ్ల క్రితం వరకూ దేశంలో వడదెబ్బ మరణాలు ఎక్కువ నమోదయ్యేవి. దీనిపై ఎన్‌ఎండిఏ వర్క్‌షాపులు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన తరువాత, దేశంలో వడదెబ్బ మరణాలు చాలావరకూ తగ్గుముఖం పట్టాయని మోదీ గుర్తు చేశారు. ‘2017 లెక్కల ప్రకారం దేశంలో నమోదైన వడదెబ్బ మరణాలు కేవలం 220. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు భద్రతకు కేంద్రం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో’ అని మోదీ ఉద్ఘాటించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణుల్లో కల్పించిన అవగాహనతో పల్లెల్లో ‘గోబర్ గ్యాస్’ ప్లాంట్లు పెరుగుతున్నాయని, పంటలకు సేంద్రీయ ఎరువులు దొరుకుతున్నాయని.. మొత్తంగా దేశ వనరుల సంపద పెరుగుతోందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత పశు సంపద (300 మిలియన్ల పశువులు) భారత్‌కు ఉందని, వీటి నుంచి రోజూ మూడు మిలియన్ టన్నుల పేడ వస్తుందన్నారు. చైనా, మరికొన్ని ఐరోపా దేశాలు పశువుల పేడతో విద్యుత్‌నే ఉత్పత్తి చేస్తున్నారని చెబుతూ, భారత్ ఆస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతోందని మోదీ అన్నారు. ఆవుపేడ, వ్యవసాయ చెత్త, వంట చెత్తతో బయోగ్యాస్ ఆధారిత విద్యుదుత్పాదన చేపట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మోదీ వివరించారు. ఈ విషయంలో రైతుల ఆర్థిక శక్తి పెరిగేలా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ‘చెత్త సేకరణ, రవాణా, బయోగ్యాస్ అమ్మకాల రూపంలో కొత్త ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విషయంలో రైతులు- కొనుగోలుదారులను అనుసంధానం చేస్తూ సులువైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ఆన్‌లైన్ వేదికను ఆవిష్కరించబోతున్నాం’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశాలను స్వయంశక్తి బృందాలు, సహకార సంఘాలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. ఆర్థిక సామర్థ్యాన్ని సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాలుగైదు రోజుల్లో రాబోతున్న హోలీ దేశ ప్రజల హృదయాల్లో ఆనందాల రంగులు వెదజల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.