జాతీయ వార్తలు

హరీశ్ రావత్ సర్కార్ డిస్మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27:తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కేంద్రం ఆదివారం ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని..దరిమిలా రాష్టప్రతి పాలన విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. రాజ్యాగంలోని 356 అధికరణ ప్రయోగానికి సంబంధించిన ప్రకటనపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉదయం సంతకం చేశారు. హరీశ్ రావత్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సహా 35మంది ఓటింగ్‌కు పట్టుబట్టినా వివాదాస్పద రీతిలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించినప్పటి నుంచీ రావత్ సర్కార్ అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగానే కొనసాగిందని కేంద్రం తెలిపింది. నిజానికి శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అసోం పర్యటనలో ఉన్న మోదీ ఇందుకోసం ఢిల్లీ తిరిగి వచ్చారు. ఉత్తరాఖండ్ గవర్నర్ కెకె పౌల్ పంపిన నివేదికలోని కీలక అంశాల ప్రాతిపదికగానే రాష్టప్రతి పాలన విధింపునకు సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం రావత్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైతే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్న ఆందోళనను కూడా గవర్నర్ తన నివేదికలో వ్యక్తం చేశారు. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సిడి కూడా ఎమ్మెల్యేల బేరసారాలు తీవ్రంగా జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయానికి ఆస్కారం ఇచ్చింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాత్రే ఉత్తరాఖండ్ పరిస్థితిని రాష్టప్రతి ప్రణబ్‌కు వివరించారు. తొమ్మిది మంది కాంగ్రెస్ రెబెల్స్‌ను అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ అనర్హులుగా ప్రకటించడం కేంద్ర నిర్ణయానికి మార్గాన్ని సుగమం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని జైట్లీ గట్టిగా సమర్థించుకున్నారు. రాజ్యాగంలోని 356 అధికరణ ప్రయోగానికి ఉత్తరాఖండ్‌లో అన్ని విధాలుగా అనువైన పరిస్థితులున్నాయని, ఇప్పటి వరకూ రావత్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా కొనసాగిందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తూ కేంద్రం రాష్టప్రతి పాలన విధించడాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంగా కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఈ నిర్ణయాన్ని బట్టి అసలు బిజెపికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నట్టుగా కనిపించడం లేదని పేర్కొంది. తన నియంతృత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని మోదీ సర్కార్ చాటుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ అన్నారు. ఉత్తరాఖండ్‌కే కాదు మోదీ సర్కార్ ధోరణి వల్ల దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటికీ ముప్పు తప్పదన్న ఆందోళన కలుగుతోందన్నారు.
కోర్టుల్లో ఎదుర్కొంటాం
సోమవారం జరిగాల్సి ఉన్న బల పరీక్షలో ముఖ్యమంత్రి రావత్ కచ్చితంగా నెగ్గుతారని కేంద్రానికి తెలుసునని, ఆయనకు ఆ అవకాశం లేకుండా చేసేందుకే రాష్టప్రతి పాలన విధించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేస్తామని, రాష్టప్రతి పాలన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తామన్నారు.
ఇది కుట్ర
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు మొదటి నుంచీ బిజెపి సర్కార్ కుట్ర పన్నుతూనే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ అన్నారు. రెండేళ్ల క్రితం కేంద్రంలో పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ బిజెపి తనను గద్దె దించేందుకు ప్రయత్నిస్తూనే ఉందన్నారు. అసెంబ్లీలో తనకే మెజార్టీ ఉందని..మరి కొన్ని గంటల్లో తాను బల పరీక్షను ఎదుర్కోబోతున్న తరుణంలోనే రాష్టప్రతి పాలన విధించారని, మెజార్టీని నిరూపించుకునే అవకాశమే తనకు లేకుండా చేశారని డెహ్రాడూన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రావత్ అన్నారు.