జాతీయ వార్తలు

ప్రైవేట్ విద్యా సంస్థలు.. అవినీతి పుట్టగొడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: రెగ్యులేటరీ వ్యవస్థల ఉదాసీనత, అవినీతి కారణంగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రోత్సాహంతో అరకొర వసతులు కలిగిన ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు రావడానికి దారితీస్తోందని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి బోధనా ‘దుకాణాల’ను అదుపు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఉన్నత విద్యాసంస్థల ఆర్థిక నిర్వహణలో ఎలాంటి పారదర్శకత ఉండడం లేదని విమర్శించిన ఆ కమిటీ ‘సమాంతర ఆర్థిక లావాదేవీలు’ కొనసాగడాన్ని ఇది ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడింది. కొత్త జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి తగిన సిఫార్సులు చేయడానికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ కమిటీని నియమించింది. మాజీ కేబినెట్ సెక్రటరీ టిఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను ఇటీవలే సమర్పించింది. ఇప్పుడున్న విధానం ప్రైవేటు విద్యా సంస్థల్లో పారదర్శకత లేని ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహిస్తూ పరోక్షంగా సమాంతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని, నాణ్యతను పెంచేందుకు, నాసిరకం విద్యాసంస్థలపైన కొరడా ఝళిపించేందుకు, విద్యార్థులను దోపిడీని అరికట్టడానికి ఈ వ్యవస్థలో ఎలాంటి ఏర్పాట్లు లేవని కూడా ఆ కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ వారమే డీమ్డ్ యూనివర్శిటీలకోసం గైడ్‌లైన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ డీమ్డ్ యూనివర్శిటీల్లో చాలాభాగం ప్రైవేటు యూనివర్శిటీలే.
యూనివర్శిటీలు, కాలేజీల్లో బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా పడి ఉండడాన్ని సైతం సుబ్రమణియన్ కమిటీ ప్రస్తావిస్తూ, ఫుల్‌టైమ్ బోధనా సిబ్బందిపై చేసే ఖర్చును ఆదా చేయడానికి చాలా రాష్ట్రాలు రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఇష్టపడ్డం లేదని పేర్కొంది. తాత్కాలిక, గెస్ట్ టీచర్లపై మితిమీరి ఆధారపడ్డం వల్ల బోధన నాణ్యత దెబ్బతింటుందని కమిటీ అభిప్రాయపడుతూ, రెగ్యులర్ బోధనా సిబ్బంది లేకపోవడం గుర్తింపు ఇచ్చే సమయంలో నెగెటివ్ అంశంగా మారుతుందనే విషయాన్ని గుర్తించాలని సూచించింది. అంతేకాకుండా ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది అవసరాలను నిర్ణయించడానికి ప్రతి అయిదేళ్లకోసారి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సిబ్బంది అవసరాలపై అధ్యయనం జరగాలని కమిటీ సిఫార్సు చేసింది.