జాతీయ వార్తలు

దిగొచ్చిన ‘మహా’ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12: సమస్యలపై కదం తొక్కిన రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. వందలాది కిలోమీటర్లు నడచి వేలాదిగా ముంబయి ఆజాద్ మైదానికి వచ్చిన రైతులు సమస్యల పరిష్కారం కోసం నినదించారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని డిమాండ్లకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర రైతులు సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు. అటవీ భూముల సాగు హక్కుతోపాటు పలు డిమాండ్లు రైతులు సాధించుకోవడం గమనార్హం. నాసిక్ నుంచి 180 కిలోమీటర్లు రేయింబవళ్లూ ఆరు రోజులపాటు నడిచి రైతుల ఆజాద్ మైదానానికి తరలివచ్చారు. రైతుల వత్తిడికి దిగొచ్చిన ప్రభుత్వం అన్ని డిమాండ్లు ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ రైతుల అన్ని డిమాండ్లూ ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే విధాన భవన్ వెలుపల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ ‘రైతుల డిమాండ్లు ఆమోదిస్తున్నాం. వ్యవసాయ భూములు గిరిజనులకు అప్పగించడానికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. 2005కి ముందు నుంచి భూములు సాగుచేసుకుంటున్నట్టు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు రైతుల డిమాండ్లన్నీ మా ప్రభుత్వం ఆమోదిస్తోంది’ అని వెల్లడించారు. న్యాయమైన డిమాండ్లకోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ఫడ్నవీస్ ‘అవి అత్యంత సున్నితమైనవి. అయినా వాటిని ఆమోదించడానికి సానుకూలంగానే ఉన్నాం’ అని ముందు రోజు ప్రకటించారు. ‘ఆజాద్ మైదానంకు తరలివచ్చిన రైతుల్లో 90 నుంచి 95 శాతం మంది పేద గిరిజనులే. సాగు చేసుకునేందుకు అటవీ భూములపై హక్కు కల్పించాలని వారు కోరుతున్నారు. వారికి న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం’ అని రైతుల మహా పాత్ర యాత్ర సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై మంత్రులో కమిటీ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
సోమవారం ఆజాద్ మైదానం ఎర్రబారిపోయింది. రైతులందరూ ఎర్రజెండాలు చేబూని కదం తొక్కారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ మహాపాదయాత్రకు నాయకత్వం వహించింది. ఎలాంటి షరతులు లేకుండా రుణలు మాఫీ చేయాలని, అటవీ భూములు బదిలీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు, కనీస గిట్టుబాటు ధరకోసం వేలాది మంది రైతులు నినదించినట్టు సీపీఎం నేత అశోక్ ధ్వాలే వెల్లడించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమక్షంలోనే రైతులు డిమాండ్లనీ ఆమోదిస్తున్నట్టు రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఎంఎన్‌సీ, శివసేన రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాకరే, శివసేన నేత ఆదిత్య థాకరే ఆదివారం రైతులతో భేటీ అయ్యారు. కాగా రైతుల బహిరంగ సభ సందర్భంగా ఆజాద్ మైదాన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతులు వారి గమ్యస్థానాలకు చేరడానికి రైల్వేశాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ముంబయి నుంచి భుసావాల్‌కు ఈ రైలు నడుస్తుంది. సైనికుల్లా పోరాడి రైతులు తమ డిమాండ్లు సాధించుకున్నారని సీపీఎం నేత ఏచూరి అన్నారు.
అన్నదాతలకు అన్నం పెట్టిన డబ్బావాలాలు
తమ డిమాండ్లు సాధించుకోడానికి మహానగరానికి తరలివచ్చిన వేలాది మంది రైతన్నలను ముంబయి వాసులు, డబ్బావాలాలు ఆదుకున్నారు. రైతుల దాహార్తిని తీర్చడంతోపాటు ఆహారం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. నాసిక్ నుంచి 180 కిలోమీటర్ల నడిచి ఆజాద్ మైదానానికి రైతులు చేరుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల కడుపునింపడం తమ కనీస బాధ్యతగా భావించామని ముంబయి డబ్బావాలా అసోసియేషన్ అధికార ప్రతినిధి సుభాష్ తలేకర్ స్పష్టం చేశారు. ‘రైతు సోదరుల కోసం దాదర్ నుంచి కొలబా వరకూ మా సభ్యుల నుంచి ఆహారం పదార్థాలు సేకరించాం’ అని ఆయన అన్నారు. అల్పాహారం, మంచి నీళ్లు అన్నం వారికి సరఫరా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం ఆరుగాలం శ్రమించే రైతులకు ఒక్కపూట అన్నం పెట్టడం కనీస బాధ్యతగా డబ్బావాలాలు భావించారని ఆయన వెల్లడించారు. అలాగే ఆదివారం రాత్రే ఆజాద్ మైదాన్‌కు తరలివచ్చిన రైతులకు ముంబయి నగరవాసులు వడ-పావ్, మంచినీళ్లు, ఆహారం అందించారు.

చిత్రం..ముంబయి లోని ఆజాద్ మైదానంలో సోమవారం మహారాష్ట్ర రైతులు నిర్వహించిన మహాధర్నా