జాతీయ వార్తలు

పార్లమెంట్.. అదే తీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం ఏడో రోజు కూడా ప్రతిపక్షం, స్వపక్షం చేసిన గొడవ మూలగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్‌సీపీతోపాటు అన్నా డీఎంకే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిస్తూ సభను స్తంభింపజేశారు. తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ స్వాతంత్య్ర సమర యోధుడు, మొదటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వేషధారణతో సభకు వచ్చి గొడవ చేశారు. మాగంటి బాబు తిరుపతి బాలాజీ బొమ్మ చేత పట్టుకుని నినాదాలిచ్చారు. పీఎన్బీకి కుచ్చుటోపి పెట్టిన నీరవ్ మోదీ ఏమయ్యాడని కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు ప్రశ్నిస్తే, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రత్యేక హోదాకోసం నినాదాలిచ్చారు. ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలిచ్చారు. అన్నా డీఎంకే సభ్యులు కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని నినదించారు. లోక్‌సభలో పోడియంను చుట్టుముట్టిన సభ్యుల సుమిత్రా మహాజన్ కనిపించకుండా ప్లకార్డులను అడ్డం పెట్టారు. మంత్రులు మాట్లాడుతున్నా, ఇంకెవరు మాట్లాడుతున్నా వారి ముఖాలకు ప్లకార్డులను అడ్డం పెట్టి నిరసన తెలిపారు.
రాజ్యసభలోనూ ఇదేతంతు కొనసాగింది. సభను సజావుగా నడిపించేందుకు సహకరించాలంటూ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. మీరు ఏ అంశాన్ని ప్రస్తావించాలనుకున్నా అనుమతిస్తా, సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోవాలి తప్ప గొడవ, నినాదాలతో కాదని ఆయన సభ్యులకు సూచించారు. సభ్యులెవరూ అదేమీ పట్టించుకోకుండా పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, గరికపాటి రామమోహన్‌రావు, టీజీ వెంకటేష్, సీతాలక్ష్మితోపాటు పలువురు కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు.

చిత్రం..లోక్‌సభలో మంగళవారం పోడియంను చుట్టుముట్టి సమావేశాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులు