జాతీయ వార్తలు

అభిశంసన కాదు.. కక్షసాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తిని అతని అసమర్థత, నిరూపిత దుష్ప్రవర్తన మూలంగానే అభిశంసించేందుకు వీలుంటుంది తప్ప ఇతర కారణాలతో కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలంటూ ఏడు ప్రతిపక్ష పార్టీలు ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుకు అభిశంసన నోటీసును అందజేయటంపై జైట్లీ స్పందించారు. న్యాయమూర్తి జీ.ఎస్.లోయ మరణం కేసులో కాంగ్రెస్ తప్పిదం నిరూపితం కావటంతో కక్ష సాధింపుకోసమే ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన పత్రాన్ని దాఖలు చేశారని జైట్లీ ఆరోపించారు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా లేని పక్షంలో ఆయన మీద ప్రతీకార చర్య తీసుకునేందుకు యాభై మంది ఎంపీలు చాలనే హెచ్చరిక సందేశాన్ని ఇతర న్యాయమూర్తులకు పంపించేందుకు జరుగుతున్న ప్రయత్నమే ఈ అభిశంసన నోటీసని ఆయన విమర్శించారు. నోటీసులో చేసిన ఆరోపణలన్నీ ఇది వరకే న్యాయపరమైన ఆదేశాల ద్వారా పరిష్కరించబడినవి లేదా అంతకుముందు జరిగిన సంఘటన ఆధారంగా తెర దించినవేనని జైట్లీ తెలిపారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అభిశంసనను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒక పదవి గౌరవ, మర్యాదల పరిరక్షణకు ఆ పదవిలో ఉన్న వ్యక్తి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే అతనిని తొలగించేందుకు ఉపయోగించేదే అభిశంసన ప్రక్రియ అని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని అభిశంసన శక్తి అనేది అంతర్ సంస్థల జవాబుదారీతనంలోని ఒక భాగం మాత్రమేనని జైట్లీ వివరించారు.
రాజకీయ వ్యవస్థలైన ఉభయ సభలకు అభిశంసించే న్యాయపరమైన అధికారం కల్పించబడిందని, ఈ కారణం చేతనే రాజకీయ వ్యవస్థలైన ఉభయ సభలు న్యాయపరమైన అధికారాన్ని వినియోగిస్తాయని, అందుకే ప్రతి సభ్యుడు న్యాయమూర్తిగా వ్యవహరిస్తారని జైట్లీ తెలిపారు. న్యాయమూర్తిగా వ్యవహరించే ప్రతి సభ్యుడు అభిశంసనకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు, వాస్తవాలను స్వతంత్రంగా సమీక్షించవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అభిశంసనకు సంబంధించిన అంశాల్లో నిర్ణయాలు పార్టీ విధానాలకు అనుగుణంగా లేదా విప్ ఆధారంగా తీసుకునేందుకు ఎంత మాత్రం వీలు లేదని జైట్లీ సూచించారు. దుష్ప్రవర్తన జరిగినట్లు రుజువైతేనే సభ్యులు తమ న్యాయపరమైన అధికారాన్ని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది, ఈ అధికారాన్ని చులకన చేయటం, అల్పంగా భావించటం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. చిన్న, చిన్న అంశాలపై యాభై మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు, వంద మంది లోకసభ సభ్యుల సంతకాలు సేకరించటం పెద్ద కష్టమేదీ కాదని ఆయన చెప్పారు. దుష్ప్రవర్తనకు సంబంధించిన సాక్ష్యాలు లేకున్నా సంఖ్యాబలంతో సభ్యులకు ఉన్న అభిశంసనాధికారాన్ని భయపట్టేందుకు ఉపయోగించటం న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రానికి ముప్పు అని జైట్లీ హెచ్చరించారు.