జాతీయ వార్తలు

ఇదొక ప్రజా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జూన్ 25: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులను ఏడాది క్రితం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పుణెలో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. మొదటి దశలో స్మార్ట్ సిటీలుగా ఎంపికయిన 20 నగరాల్లో మొత్తం రూ.2,900 కోట్ల విలువైన 69 ప్రాజెక్టులను పుణెలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. పుణెలో సుమారు 1770 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ స్మార్ట్ సిటీల ప్రాజెక్ట్ ఒక ప్రజా ఉద్యమమని, ఇది విజయవంతమవుతోందని సగర్వంగా ప్రకటించారు. ‘పట్టణీకరణ (అర్బనైజేషన్)ను మనం ఓ సమస్యగా కాక ఒక అవకాశంగా చూడాలి. మనం భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించినట్లయితే దీన్ని ఒక అవకాశంగా మలుచుకోగలం. గ్రోత్ సెంటర్లుగా ఎదగగల సామర్థ్యం నగరాలకు ఉంది. ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో పేదలు నగరాలకు వలస వస్తారు. అందువల్ల నగరాలను పేద ప్రజలు ఎదగడానికి, అభివృద్ధికి కేంద్రాలుగా తయారు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీలుగా ఎంపికయిన 20 నగరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుణెతో అనుసంధానం చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), వసుంధరా రాజె సింధియా (రాజస్థాన్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), ఇతర మంత్రులు, అధికారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ తమ రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలకు సంబందించి ప్రణాళికలను వారు ప్రధానికి వివరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించడానికి వీలుగా నగరాలు స్మార్ట్ సిటీలుగా మారాలని,
అప్పుడు అవి ఇతర నగరాలకు మార్గదర్శకాలవుతాయని అన్నారు. ఈ పథకం పట్ల ప్రజలు అద్భుతమైన ఆసక్తి కనబరుస్తున్నారని, ఇందులో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించడానికి పుణె నగరాన్ని ఎన్నుకున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు వివిధ నగరాల్లో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ‘అమృత్’ పథకం కింద చేపట్టన పథకాలు, మురికివాడ ప్రజల పునరావాసం కోసం చేపట్టిన పథకాలు, పేద ప్రజల గృహ నిర్మాణ ప్రాజెక్టులు, సీవేజ్ ప్లాంట్‌లులాంటివి ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని ‘మేక్ యువర్ సిటీ స్మార్ట్’ పోటీని ప్రారంభించారు. స్మార్ట్ సిటీల రూపకల్పనకోసం విలువైన సలహాలు, సూచనలు చేసే వారికి ఈ పోటీలో పది వేలనుంచి లక్ష రూపాయల దాకా నగదు బహుమతులు అందజేస్తారు. అలాగే స్మార్ట్ నెట్ పోర్టల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ పాల్గొన్నారు.

చిత్రం శనివారం పుణెలో స్మార్ట్ సిటీల ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవడేకర్ తదితరులు.

ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం స్క్రీన్‌పై స్మార్ట్ సిటీస్ మ్యాపులను పరిశీలిస్తున్న మోదీ.