జాతీయ వార్తలు

కళంకిత యుపిఏకు కొమ్ముకాశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బారాబంకి, జూన్ 27: ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా నుంచి జరిగిన వలసలు, ఇటీవల మధురలో హింస పెచ్చరిల్లడంపై అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కళంకిత యుపిఎ ప్రభుత్వానికి సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి మద్దతు ఇచ్చారని విమర్శించారు. వచ్చే సంవత్సరం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అమిత్ షా ప్రయత్నించారు.
‘ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కావాలంటే బిజెపికే ఓటు వేయాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ వాసిగా చిత్రీకరించడానికి షా ప్రయత్నించారు. తాను గుజరాత్ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జీ గుజరాత్‌కు చెందిన వ్యక్తి అని అక్కడి ప్రజలు అన్నారని, అయితే తాను, వారణాసి నుంచి ఎంపీగా గెలిచినందున మోదీ జీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని తాను వారితో అన్నానని షా చెప్పారు. ఖైరానా నుంచి వలసల విషయంపై ఉత్తరప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్‌పై అమిత్ షా ధ్వజమెత్తారు. ‘అది శాంతిభద్రతల సమస్య అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే అధికారాన్ని ప్రజలు ఎవరికి అప్పగించారని నేను అడుగుతున్నాను’ అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇక్కడి శాంతిభద్రతల వ్యవహారాలు చూస్తారా? అని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ను మూడున్నర మంది ముఖ్యమంత్రులు పాలిస్తున్నారని షా వ్యంగ్యోక్తులు విసిరారు. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్ ముగ్గురు ముఖ్యమంత్రులు కాగా, ఆజంఖాన్ సగం ముఖ్యమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఒక కులానికి, ఒక మతానికి చెందిన వారి పట్ల పక్షపాతం ప్రదర్శిస్తోందని, వారికే ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని అమిత్ షా ఆరోపించారు.

చిత్రం బారాబంకిలో సోమవారం బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా