జాతీయ వార్తలు

వాళ్లలో వాళ్లకే పడదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల సమీకరణ వలన తమకు రాజకీయంగా ఎలాంటి హానీ జరగదని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఎంత పుంజుకుంటే కాంగ్రెస్‌కు అంతగా నష్టం.. భవిష్యత్తులో కర్నాటక మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో పని చేయవలసి వస్తుందని బీజేపీ నాయకులు భావన. ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపటం వలన కాంగ్రెస్ తన జాతీయ రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు ఒక వేదికపైకి రావటంపై బీజేపీ అధినాయకత్వం సమీక్షించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీల సమీకరణ వలన ఈ సంవత్సరాంతంలో జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై బీజేపీ సమాలోచనలు జరుపుతోంది. ప్రాంతీయ పార్టీల రాజకీయ మనుగడ స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వీరు జాతీయ స్థాయిలో ఒక అజెండాపై కలిసి పనిచేయటం సాధ్యం కాదని బీజేపీ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బెంగళూరు వేదికను వామపక్షాలతో కలిసి పంచుకున్నా కోల్‌కత్తాలో మాత్రం అలాంటి సందర్భం జరిగే అవకాశమే లేదు. ఇదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయటం అసాధ్యం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని బీజేపీ నాయకులు లెక్కలు కడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ తన రాజకీయ మనుగడను ఎప్పుడో కోల్పోయింది. అక్కడ సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ ప్రాధాన పాత్ర నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే ఉండదని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో పలు ప్రాంతీయ పార్టీలు ఒక వేదిక మీదికి వచ్చినా, అతిత్వరలో ఈ కూటమిలో నాయకత్వం అంశంపై విభేదాలు పొడసూపటం ఖాయమని వారంటున్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. అలాగే మాయావతి, అఖిలేష్ యాదవ్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. చంద్రబాబు లాంటి నాయకులు బెంగళూరు వేదికను తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటారు తప్ప ప్రతిపక్ష సమైక్యత కోసం పని చేయలేరని బీజేపీ నాయకులు ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ పట్ల తనకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు చంద్రబాబుకు బెంగళూరు వేదికగా పనికి వచ్చిందని వారు చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ శాసనసభలకు జరిగే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ-కాంగ్రెస్ మధ్యే ఉంటుందని, కాబట్టి ప్రాంతీయ పార్టీల సమైక్య ప్రభావం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలపై ఏమాత్రం ఉండదన్నది బీజేపీ నాయకుల వాదన. బెంగళూరు వేదిక ఎక్కిన చంద్రబాబు అమరావతికి తిరిగిరాగానే నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ ప్రతిపక్షాల సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానంటూ ప్రకటన చేస్తే.. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య మంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించటం ప్రతిపక్షాల అనైక్యతకు అద్దం పడుతోందని వారంటున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్, జేడీ(ఎస్) దొడ్డిదారిన అధికారంలోకి రావటాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు.