జాతీయ వార్తలు

మూడు రథాలు.. ముగ్ధులైన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ, జూలై 14: అటు తూర్పు తీరం పవిత్ర పూరీ పుణ్య క్షేత్రంలో జగన్నాథ రథచక్రాలు కదిలాయి. ఇటు పశ్చిమ తీరంలో అహ్మదాబాద్‌లో కూడా జగన్నాథ యాత్ర కన్నుల పండువగా ప్రారంభమైంది. ఒడిశాలోని పూరీ దివ్యక్షేత్రం లక్షలాది మంది భక్తుల ఓం నమో జగన్నాథయా నమః, దారో జగన్నాథ హరే మురారే నినాదాలతో మార్మోగింది. అశేష సంఖ్యలో హాజరైన భక్తులతో పూరీ పరవశం చెందింది. మహిమాన్విత అపురూప మూడు రథాలను భక్తిశ్రద్ధలతో లాగుతుండగా, జగన్నాథ రథ చక్రాలు చకాచకా కదిలాయి. పూరీ జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా శనివారం ఆరంభమైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 141వ జగన్నాథయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పూరీ జగన్నాథయాత్రను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది హిందువులు ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉన్న పూరీ హిందువులకు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. సర్వం జగన్నాథమయం అంటూ భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలుతుంటారు. తొమ్మిది రోజుల జగన్నాథ యాత్రను చూసేందుకు, రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడతారు. పూరీ జగన్నాథుడు, బలభధ్రుడు, దేవి సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచి గుడించా దేవాలయం వరకు తీసుకెళ్లారు. ఈ రథం ముందు వెనక భక్తుల జనసందోహం కిటకిటలాడింది. పురుషోత్తమ క్షేత్రం పూరీలో రథాలు ఆగమ శాస్త్రానుసారం తయారు చేస్తారు. జగన్నాథయాత్ర సందర్భంగా రథాల మీద ప్రత్యేక ఆసనం మీద ఉంచే విగ్రహాలను, రథం ఎక్కి తాకేందుకు ప్రయత్నించడాన్ని నిషేధించినట్లు, నేరంగా పరిగణిస్తామని ఆలయ ప్రధాన పరిపాలనాధికారి ప్రకటించారు. జగన్నాథ ఆలయంలో వారసత్వంగా విధులు నిర్వహించే సేవకులు మాత్రమే రథాన్ని ఎక్కేందుకు అర్హులని ఆయన తెలిపారు.
భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోని హిందువులకు పూరీ జగన్నాథ ఆలయ సందర్శనం నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శుక్ల ద్వితీయ విదియ నాడు జరిగే జగన్నాథయాత్రను చూసేందుకు భక్తులు తపిస్తుంటారు. ఈ సందర్భంగా పూరీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 140 ప్లాటూన్ల పోలీసు బలగాలను నియమించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఓడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ను రంగంలోకి దించినట్లు, వ్యూహాత్మక ప్రదేశాల్లో బలగాలను మెహరించినట్లు డీజీపీ ఆర్‌పీ శర్మ చెప్పారు జగన్నాథయాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు రథయాత్ర జరిగే దారికి ఇరువైపుల ఉన్న భవనాలను ఎక్కారు.
పూరీ జగన్నాథ ఆలయ గర్భ గుడి నుంచి వేదమంత్రోచ్ఛరణ మధ్య జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర పవిత్ర విగ్రహాలను బయటకు తెచ్చి వాటికి పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి బయటకు వచ్చేందుకు 22 మెట్లు ఉంటాయి. ఆ మెట్లను బైసి పహచా అంటారు. సింహద్వారం ద్వారా ఈ మెట్ల వద్దకు అర్చక స్వాములు విగ్రహాలను తెస్తారు. సింహ ద్వార వద్ద పహండి పేరిట వేదాపారాయణం చేస్తారు. అనంతరం రథాలపైకి విగ్రహాలను ఎక్కించిన తర్వాత మేళతాళాలు, సంగీత వాయిద్యాలు మధ్య భక్తి పారవశ్యంతో రథాన్ని భక్తులు లాగుతూ ముందడుగు వేస్తున్న దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తాయి. ప్రత్యేక కలపతో తయారుచేసిన ఈ రథాలు మూడు కి.మీ దూరం ప్రయాణం చేసి గుడించ దేవాలయం వద్దకు చేరాయి. 45 అడుగుల ఎత్తు ఉన్న జగన్నాథ స్వామి ఆసీనులై ఉన్న రథానికి 16 చక్రాలు ఉంటాయి. బలభద్ర రథానికి 14 చక్రాలు, సుభద్ర రథానికి 12 చక్రాలు ఉంటాయి. రథోత్సవం సందర్భంగా పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గజపతి మహారాజ దివ్యసింగ్ దేవ్ కుటుంబ సభ్యులు రథం ముందు నడవగా, హరోం హర హర జగన్నాథాయ నమః అంటూ లక్షలాది మంది భక్తులు రథాలను లాగారు. పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో భారత్ సిరిసంపదలతో తులతూగాలని వారు ఆకాంక్షించారు.