జాతీయ వార్తలు

ఆ మత్స్యకారులు.. సూపర్ హీరోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 21: ఆపదలెదురైనపుడు తరతమ భేదాలకు తావులేకుండా ఆపన్నహస్తం అందించాలన్న మహదాశయంతో కేరళ వరదల్లో నిరుపమాన తెగువ, సేవాతత్పరతలను ప్రదర్శించి మత్స్యకారులు అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఎర్నాకుళం జిల్లాలో జలవిలయంలో చిక్కి విలవిలలాడుతున్న యాభై నాలుగు వేల మందికి పైగా వరద బాధితులను రక్షించిన వీరిని ప్రసార, సామాజిక మాధ్యమాలు సూపర్ హీరోలుగా కీర్తిస్తున్నాయి. సుమారు 18 వేల మందికి పైగా మత్స్యకారులు స్వచ్ఛంద రక్షకులుగా మారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసోపేతంగా భీతావహ వరదల్లో 240 పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మందిని రక్షించి అసమాన మానవతా విలువలు చాటారు. సినిమా తెరపై చూసే కథానాయకుల సాహసాలను ఈ ప్రత్యక్ష హీరోలు కళ్లకు కట్టించారు. వీరంతా తిరువనంతపురం, కొల్లం, కానూర్, మలప్పురం, త్రిశూర్, ఎర్నాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు. ఘోర విపత్తులో కేరళ రాష్ట్ర ప్రజలు కుల, మత, వర్గ రహితంగా ఒక్కటై సమస్యను అధిగమించేందుకు పరస్పరం సహకరించుకున్న తీరు ప్రపంచ దృష్టిని అకర్షించింది. ఆ రాష్ట్ర చరిత్రలో మరువలేని మహావిపత్తుగా మిగిలిన ఈ వరదలు సుమారు 373 మందిని బలిగొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం చేష్టలుడిగి ఆపన్న హస్తం కోసం కేంద్రాన్ని, అన్య రాష్ట్రాలను అర్థించే పరిస్థితి నెలకొనడం అక్కడి మత్స్యకారులను తీవ్రంగా కలచివేసింది. భారత సైనిక దళాలు, నౌకా దళాలు, జాతీయ విపత్తు సహాయక బృందాలు ఓ వైపు శక్తివంచన లేకుండా రాత్రింబవళ్లు కృషి చేస్తున్నా మరోవైపు ప్రాణ, ఆస్తి నష్టాలు అనివార్యం కావడాన్ని గమనించి మత్స్యకారులు తమ వంతు బాధ్యతగా రంగంలోకి దూకారు. స్థానికంగా తయారైన పరికరాలు, పడవల సహాయంతో మారుమూల ప్రాంతాల్లోని వరదపీడిత ప్రాంతాలకు తరలివెళ్లి వేలాది మందిని రక్షించారు. అలాగే వారి పడవల ద్వారా ప్రభుత్వ సహాయక బృందాలను సైతం వరదబాధిత ప్రాంతాలకు తరలించారు.

చిత్రం..సముద్రపు ఒడ్డున ఉన్న తమ పడవలను మెట్ట ప్రాంతాలకు తరలిస్తున్న జాలర్లు