జాతీయ వార్తలు

3 లక్షలు దాటే నగదు లావాదేవీలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని అరికట్టడానికి రూ. మూడు లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధించడంతో పాటు వ్యక్తులు రూ. 15 లక్షలకు మించిన నగదును తమ వద్ద ఉంచుకోకుండా నియంత్రించాలని నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సు చేసింది. జస్టిస్ (రిటైర్డ్) ఎంబి షా నేతృత్వంలోని సిట్ ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై రూపొందించిన తన అయిదో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. పెద్ద మొత్తంలో లెక్కలు చెప్పని సంపదను నగదు రూపంలో నిల్వ ఉంచటం, నగదు రూపంలో వినియోగించడం జరుగుతోందని సిట్ తన నివేదికలో వివరించింది. నగదు లావాదేవీలకు సంబంధించి వివిధ దేశాల్లో అమలులో ఉన్న నిబంధనలను, వివిధ నివేదికలను, న్యాయస్థానాలు చేసిన వివిధ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు నగదు లావాదేవీలకు గరిష్ఠ పరిమితిని విధించవలసిన అవసరం ఉందని సిట్ అభిప్రాయపడినట్లు ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. రూ. మూడు లక్షలకు మించిన నగదు లావాదేవీలను పూర్తిగా నిషేధించాలని, ఈ పరిమితికి మించిన లావాదేవీలు అక్రమమని, ఈ లావాదేవీలకు పాల్పడిన వారు చట్టప్రకారం శిక్షార్హులని పేర్కొంటూ ఒక చట్టాన్ని రూపొందించాలని సిట్ సిఫార్సు చేసిందని ఆ ప్రకటన వివరించింది. వ్యక్తులు నగదు నిల్వలను కలిగి ఉండటంపై పరిమితిని విధిస్తేనే నగదు లావాదేవీలపై పరిమితి విధింపు విజయవంతం అవుతుందని కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది. అందువల్ల వ్యక్తులు తమ వద్ద నిల్వ ఉంచుకోవడానికి గరిష్ఠ పరిమితిని రూ. 15 లక్షలుగా విధించాలని కూడా సిట్ సిఫార్సు చేసిందని ఆ ప్రకటన వెల్లడించింది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా, పరిశ్రమ అయినా అంతకు మించి నగదు నిల్వ ఉంచుకోవలసిన అవసరం వస్తే, అందుకోసం ఆ ప్రాంతానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవచ్చని సిట్ సూచించింది.