జాతీయ వార్తలు

గవర్నర్లకు ఐదేళ్ళ పదవీకాలం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: గవర్నర్లకు ఐదేళ్ల నిర్దిష్ట పదవీ కాల పరిమితి ఉండాలన్న జస్టిస్ ఎంఎం పూంఛి కమిషన్ సిఫార్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అన్నారు. గవర్నర్లను ప్రజలుగానీ, ప్రజా ప్రతినిధులు గాని ఎన్నుకోరని, వారికి ఐదేళ్ల పదవీ కాలపరిమితిని నిర్దేశించడం అభిలషణీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ ఎంఎం పూంఛి కమిషన్ నిర్మాణాత్మకమైన సిఫారసులు చేసిందని చెబుతూనే కొన్ని సిఫార్సులు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. న్యూఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాజ్యాంగంలోని 61ఎ అధికరణ ప్రకారం గవర్నర్‌ను అభిశంసించవచ్చన్న సిఫారసు కూడా తమకు అంగీకారయోగ్యం కాదన్నారు. అలాగే 355, 356 అధికరణల కింద రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పేరిట కేంద్ర బలగాలను మోహరించేందుకు వీలు కల్పించే సిఫారసును కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనలో యుపిఏ ప్రభుత్వం ఏపికి తీరని అన్యాయం చేసిందనీ, ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం కూడా ఏపి సమస్యల పరిష్కారానికి కొన్ని చర్యలు మాత్రమే తీసుకుందనీ ఫిర్యాదు చేశారు. పొరుగు రాష్ట్రాల స్థాయికి ఎదగాలంటే ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆర్థిక సాయం అందించడంతోపాటు వౌలిక సదుపాయాల కల్పనకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ‘పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి.. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలి.. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి.. పారిశ్రామికీకరణను త్వరితగతిన సాధించేందుకు ప్రత్యేక పన్ను రాయితీలు కల్పించాలి.. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు మిగతా గ్రాంటును వెంటనే విడుదల చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయనేది ఈ సమావేశంలో ఉన్న నాయకులందరికీ తెలుసు కాబట్టి ఏపికి ప్రత్యేక హోదాను అమలు చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని చంద్రబాబు విజప్తి చేశారు.
దిగువ రాష్టమ్రైన ఏపికి నీటిపారుదల విషయంలో కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి వాపోయారు. ఇంతవరకు గోదావరి, కృష్ణా నదీ నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం అన్ని కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయినందున ఇలాంటి సంస్థలను ఏపిలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రంలో గ్రే హౌండ్స్ శిక్షణ సంస్థ, ఏపి పోలీస్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరించాలన్నారు.

చిత్రం.. ప్రధాని నరేంద్ర మోదీతో కలచాలనం చేస్తున్న చంద్రబాబు