జాతీయ వార్తలు

రాఫెల్‌పై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరిని కోరింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉప నాయకుడు ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, సీనియర్ నాయకులు కపిల్ సిబల్, జైరాం రమేష్, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, వివేక్ తంఖా, ప్రమోద్ తివారీ, ప్రణవ్ ఝా తదితరులు సోమవారం చౌదరిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై నివేదిక తయారు చేసి పార్లమెంట్ ముందు ప్రతిపాదించాలని నిన్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను కోరిన కాంగ్రెస్ అధినాయకత్వం సోమవారం సీవీసీని కలిసి రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. రాఫెల్ కాంట్రాక్టును రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థకు ఇప్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశానికి తీరని నష్టం కలిగించిందని సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు ఇవ్వకుండా తన స్నేహితుడైన ఒక వ్యాపారవేత్తకు దీనిని కట్టబెట్టడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంపై సీవీసీకి వివరణాత్మక నివేదికను అందజేశామని ఆనంద్ శర్మ విలేఖరులకు చెప్పారు. దేశ చరిత్రలో రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించిన అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’ ఒప్పందమని ఆనంద్ శర్మ ప్రకటించారు. యుద్ధ విమానాలను భారతదేశంలో ఉత్పత్తి చేసే కాంట్రాక్టును రిలయన్స్‌కు ఇవ్వాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏకపక్ష నిర్ణయమని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. హెచ్‌ఏఎల్ భాగస్వామ్యం, రాఫెల్ యుద్ధ విమానాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, రాఫెల్ యుద్ధ విమానం ఖరీదును రూ.526 కోట్ల నుండి రూ.1670కోట్లకు పెంచటం అత్యంత తీవ్రమైన విషయం కాబట్టి ఈ అంశాలపై వెంటనే విచారణ జరపాలని సీవీసీని కోరినట్లు ఆనంద్ శర్మ తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఈ శతాబ్దానికి సంబంధించిన అతిపెద్ద కుంభకోణమని ఆయన ప్రకటించారు. రాఫెల్ ఒప్పందం మూలంగా దేశానికి చెందిన 41వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాబోతున్నాయని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు గురించి రక్షణ శాఖ కార్యదర్శికి కూడా తెలియదనేది సీవీసీకి వివరించామన్నారు. ప్రభుత్వం తప్పులు చెబుతోంది.. కాబట్టి రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలను జప్తుచేసి విచారణ జరపాలి, నిందితులను శిక్షించాలని సీవీసీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను తారుమారు చేసే ప్రమాదం ఉన్నదని ఆయన ఆరోపించారు. సీవీసీకి వినతిపత్రం ఇచ్చినందున ఇకమీదట ఏం చేయాలనేది సీవీసీ నిర్ణయించవలసి ఉంటుందని ఆనంద్ శర్మ చెప్పారు. ఇదిలాఉంటే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ కాంగ్రెస్‌తో కుమ్మకయ్యాడంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్ ఖండించారు. బీజేపీ చౌకబారు రాజకీయం చేస్తోందని, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం వలన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు చెడిపోతాయనే ఆలోచన కూడా ఎన్‌డీఏ ప్రభుత్వానికి లేదని ఆయన దుయ్యబట్టారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యాడనడం హాస్యాస్పదం కాదా అని సింఘ్వీ ప్రశ్నించారు. సిఏజీని బెదిరించటం అరుణ్ జైట్లీకి ఎంతమాత్రం తగదని ఆయన స్పష్టం చేశారు.
చిత్రం..రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై సీవీసీని కలుసుకున్న కాంగ్రెస్ నేతల బృందం