జాతీయ వార్తలు

అరుణాచల్‌లో హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, జూలై 16: అరుణాచల్ ప్రదేశ్‌లో శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో పోయిన పదవిని చేజిక్కించుకున్న ముఖ్యమంత్రి నబం టుకీ పదవిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం వర్గం ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అత్యవసర సమావేశమైన సిఎల్పీ సమావేశంలో తమ నేతగా పేమా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎత్తులు వేసింది. తనకు 45 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని కొత్త సిఎల్పీనేత పేమా ఖండూ ప్రకటించడంతో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. 37 ఏళ్ల పేమా ఖండూ దివంగత మాజీ ముఖ్యమంత్రి డోర్జి ఖండూ కుమారుడు. కాగా శనివారం శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోవల్సి ఉన్న నబం టుకీ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు పది రోజుల గడువుకోరగా తాత్కాలిక గవర్నర్ తథాగథ్ రాయ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో శాసన సభాపక్షనేత పదవికి నబం రాజీనామా చేశారు. మరోపక్క కొత్త సిఎల్పీ నేతగా ఎన్నికైన పేమా ఖండూ పేరును ఆయన ప్రతిపాదించారు. అసెంబ్లీ స్పీకర్ నబం రెబియా సమావేశానికి గైర్హాజరుకాగా, రెబల్ నేత, పదవీచ్యుత సిఎం కలికోపుల్ తన మద్దతుదారులతో సమావేశానికి హాజరయ్యారు. అరవై మంది సభ్యులున్న అసెంబ్లీలో తనకు 47 మంది పద్దతు ఉందని పుల్ చెబుతున్నారు. తనకు సంపూర్ణ మద్దతు ఉన్నందున సభలో బలపరీక్ష నిరూపించుకోవల్సిన అవసరం లేదని ఖండూ సమక్షంలోనే మాజీ సిఎం పుల్ ప్రకటించడం గమనార్హం. అయితే 47 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు ఉన్న తానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఖండూ ప్రకటించారు. ప్రస్తుతానికైతే గవర్నర్ వైపునుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం వెలువడలేదని, కాబట్టి ఎప్పుడు ప్రమాణస్వీకారం చేసేది చెప్పలేనని ఖండూ స్పష్టం చేశారు. తాజా పరిణామాలను కాంగ్రెస్‌కు మరింత బలం చేకూర్చేవని పరిశీలకులు అంటున్నారు. పార్టీని చక్కదిద్దడానికి హైకమాండ్‌కు మంచి అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.

చిత్రం.. సిఎల్‌పి నేతగా పేమా ఖండూ ఎన్నికైన తరువాత గవర్నర్ తథాగథ్ రాయ్‌ని కలిసి రాజీనామా సమర్పించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నబం టుకీ