జాతీయ వార్తలు

74మందితో తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాను శనివారం ప్రకటించనున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం గురువారం 74 మంది అభ్యర్థుల పేర్లను ఆమోదించింది. మిగతా పేర్లను తరువాత ఖరారు చేస్తారు. గెలిచే సత్తా ఉన్నవారిని మాత్రమే పోటీలోకి దించేందుకు అధినాయకత్వం సమాయత్తమైంది. అందుకు సామాజిక న్యాయం విధానానికి కూడా స్వస్తి పలకడంతో వెనుకబడిన కులాల వారికి తక్కువ సీట్లు లభించవచ్చు. రెడ్డి వర్గానికి మెజారిటీ సీట్లు కేటాయిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయ. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన అనంతరం అసమ్మతి మంటలు రేగకుండా చూసేందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీలోని పార్టీ వార్ రూంలో ఆశావహులను బుజ్జగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తగు పదవుల్లో నియమిస్తామని టికెట్లు దక్కనివారికి హామీ ఇచ్చారు. కొందరు ఆశావహులు అధినాయకత్వం మాటకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వగా, మరికొందరు మాత్రం తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశాలను పరిశీలిస్తున్నారు. తమ వర్గానికి అన్యాయం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీ వర్గం నాయకులు హెచ్చరించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా అధ్యక్షతన ఆమె నివాసంలో జరిగిన సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు
ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ హాజరయ్యారు. కాంగ్రెస్‌తోపాటు మహాకూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం (14 సీట్లు), టీజేఎస్ (ఎనిమిది), సీపీఐ (మూడు) అభ్యర్థుల పేర్లను కూడా శనివారం ప్రకటించవచ్చు. కాంగ్రెస్ అధినాయకత్వం 54 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇదివరకే ఖరారు చేసింది. భక్తచరణ్‌దాస్ నాయకత్వంలోని తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ గత మూడు రోజుల నుండి ఢిల్లీలో సమావేశాలు జరుపుతూ మిగతా నలభై నియోజకర్గాల నుండి పోటీ చేయవలసిన అభ్యర్థుల గురించి చర్చలు జరిపి ఇరవై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా పదిహేను నియోజకవర్గాలకు రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేసింది. ఈ పదిహేను నియోజకవర్గాల నుండి పోటీ పడుతున్న పార్టీ అశావహులను ఢిల్లీకి పిలిపించి గురువారం స్క్రీనింగ్ కమిటీ ముఖాముఖి చర్చలు జరిపింది. వెనుకబడిన కులాలకు ముందు ప్రకటించిన ప్రకారం 34 టికెట్లు ఇచ్చే సూచనలుకనిపించట లేదు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయటంలో గెలుపే ప్రధానంశంగా తీసుకున్నారు. కాంగ్రెస్ జాబితాలో మెజారిటీ టికెట్లను రెడ్డి వర్గం సాధించుకున్నట్లు చెబుతున్నారు. ఎస్సీలకు రిజర్వుడు సీట్లతోపాటు ఒకటి, రెండు జనరల్ సీట్లు కూడా కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళలకు కూడా సముచిత స్థానం లభించకపోవచ్చునని తెలిసింది.
నాలుగు గంటల పాటు బుజ్జగింపులు
ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న 15 నియోజకవర్గాల్లో అసమ్మతిని అదుపు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు గురువారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ముఖాముఖి చర్చలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.జానారెడ్డి, భక్తచరణ్‌దాస్, కుంతియా, పీఆర్‌ఓ శర్మిష్ట ముఖర్జీతోపాటు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా నియమించిన కార్యదర్శులు జ్యోతిమణి, సలీం, శ్రీనివాస కృష్ణన్, బోసురాజు బుజ్జగింపుల కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, పెద్దపల్లి, దేవరకొండ, ఎల్లారెడ్డి, బాల్గొండ, నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్, ఇల్లెందు, మంచిర్యాల, మెదక్ తదితర పదిహేను నియోజకవర్గాలకు చెందిన ఆశావహులతో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ముఖాముఖి చర్చలు జరిపింది. నియోజకవర్గం వారీగా ఆశావహులను లోపలికి పిలిపించి చర్చలు జరిపారు. ‘మీరందరూ మాకు మఖ్యం.. మీలో ఎవ్వరికి టికెట్ లభించినా పార్టీ విజయం కోసం కృషి చేయాలి.. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టికెట్లులభించనివారి ప్రయోజనాలు కాపాడుతామని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటం ముఖ్యం కాబట్టి మీరంతా పార్టీ విజయం కోసం కృషి చేయాలిని వారికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా తాను పార్టీకోసం ఎంతో కృషి చేస్తుంటే ఇప్పుడు బయటి నుండి వచ్చినవారికి టికెట్ ఇవ్వాలని ఎలా ఆలోచిస్తారని ఇబ్రహీంపట్నం టికెట్ కోరుతున్న క్యామా మల్లేష్ ప్రశ్నించారు. ముడుపులు ఇచ్చినవారికి టికెట్లు కేటాయించటం మంచిది కాదని మరి కొందరు హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాల నుండి పార్టీకోసం పని చేస్తున్నవారిని పక్కన పెట్టి బైటినుండి వచ్చినవారికి టికెట్లు ఇవ్వటం మంచిది కాదని సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ విధేయులను పక్కన పెట్టి ఇటీవలే పార్టీలో చేరినవారికి టికెట్లు ఇవ్వకూడదని సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్క్రీనింగ్ కమిటీకి స్పష్టం చేశారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుండి సీట్లను బీసీకు కేటాయించాలన్న రాహుల్ గాంధీ ఆదేశం అమలయ్యే సూచనలు కనిపించటం లేదు.