జాతీయ వార్తలు

హోదాపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై హస్తినలో రాజకీయం రసకందాయంగా సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు శుక్రవారం చివరి రెండున్నర గంటల్లో చర్చకు రానుంది. ఇది ఓటింగ్ దాకా వెళ్తుందా? లేక ఓటింగ్‌కు రాకుండా అధికార బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ బిల్లును ఉపసంహరించుకునేందుకు కెవిపి అంగీకరించకపోతే మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ వివాదానికి తెర దించడం మంచిదని బిజెపి అధిష్ఠానం భావిస్తోందా? అన్నదానిపై స్పష్టత రాలేదు. కెవిపి బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వివిధ విపక్షాల మద్దతును కూడగట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాయాది తెలుగుదేశం పార్టీ తప్పనిసరి రాజకీయ పరిస్థితిలో బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఓటింగ్‌కు వస్తే అనుకూలంగానే ఓటేస్తామని కూడా స్పష్టం చేయాల్సి వచ్చింది. దీంతో పాటు ఉభయ వామపక్షాలు, జెడియు, ఆర్జేడీ, సమాజ్‌వాదితో పాటు మరో రెండు పార్టీలు ‘హోదా’ బిల్లుకు సానుకూలతను వ్యక్తం చేశాయి. అదే సమయంలో డిఎంకె, అన్నాడిఎంకె, బిజెడి, తృణమూల్ కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తున్నాయి. అయితే అధికార బిజెపి మాత్రం ఇంతవరకూ బయటపడలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఈ బిల్లును బిజెపి బాహాటంగా వ్యతిరేకించే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి పని చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ కష్టతరం కావటమే కాకుండా, మిత్రపక్షమైన తెలుగుదేశంలో సంబంధాలు చెడిపోవచ్చనే భావనా బిజెపి అధిష్ఠానంలో ఉంది. ఇప్పుడు ఈ సమస్యలను కొనితెచ్చుకోవటం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. దానికంటే, ఎలాగూ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వకూడదన్న విధాన నిర్ణయం తీసుకున్నందున, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా ఇబ్బంది లేదనే వైఖరిని బిజెపి ప్రదర్శించే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఆ సమావేశంలోనే బిల్లుపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వీలైనంత వరకూ శుక్రవారం ఈ బిల్లు ఓటింగ్ దాకా రాకూడదనే బిజెపి, తెలుగుదేశం పార్టీలు కోరుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాల మద్దతు కోసం కూడా ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ మెంబర్ బిల్లుతో రాజ్యసభలో బిజెపిని ఏకాకిని చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఇందుకోసం పార్టీ ఏపి వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేశ్‌లు వివిధ పార్టీల నేతలతో మంతనాలు చేస్తున్నారు. మరోవైపు బిజెపి రాష్ట్ర నేతలు బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలని తమ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. బిల్లును రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించేలా చేయటం ద్వారా, ప్రస్తుతానికి రాష్ట్రంలో తలెత్తే సమస్యల నుంచి బయటపడవచ్చని పార్టీ నేతలు పార్టీ కేంద్రనాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.