జాతీయ వార్తలు

ఆమోదం పొందితే చట్టమయినట్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ఏపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్వల్పకాలిక చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ జరుగుతుంది. ఏదైనా వివాదం మూలంగా సభలో గందరగోళం రేగితే, దాని వల్ల సభాకార్యక్రమాలు స్తంభించిపోయి సోమవారానికి వాయిదా పడినట్లయితే.. మళ్లీ శుక్రవారం దాకా బిల్లు సభ ముందుకు రాదు. ఒకవేళ చర్చకు చైర్మన్ అవకాశమిచ్చి, బిల్లును ప్రతిపాదించిన సభ్యుడు (కెవిపి) ఓటింగ్‌కు పట్టుబడితే అప్పుడు కచ్చితంగా ఓటింగ్ జరపక తప్పదు. అదే పరిస్థితి ఏర్పడితే మూజువాణి ఓటుతో రాజ్యసభలో బిల్లు ఆమోదానికి సభానాయకుడు అంగీకరించవచ్చు. కానీ, అంతకంటే ముందు బిల్లును ఉపసంహరించుకోవలసిందిగా సభానాయకుడు అరుణ్‌జైట్లీ కానీ, పాలక పక్షానికి చెందిన మరో సీనియర్ మంత్రి కానీ సభ్యుణ్ణి కోరతారు.
బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అరుణ్‌జైట్లీకి కెవిపి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ, వాటికి ప్రభుత్వం తరపున పరిష్కారాలను చూపించే అవకాశం ఉంది. లేదా ఆ అంశాలను పరిశీలించి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తామని చెప్పవచ్చు. ఆ తరువాత బిల్లు ఉపసంహరణకు కెవిపిని ఆయన కోరతారు. అయితే అందుకు కెవిపి అంగీకరించకపోతే ఓటింగ్ తప్పదు. ఈ దశలో మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ చైర్మన్ ఆమోదిస్తారు. ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సంకేతప్రాయంగా తెలిపారు. అయితే రాజ్యసభ ఆమోదించినంత మాత్రాన బిల్లు చట్టరూపంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయంగా రచ్చగా మారిన ఈ వివాదానికి తెరదించటమే అధికార పార్టీ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత కెవిపి సహా దానికి మద్దతునిస్తున్న తెలుగుదేశం సహా అన్ని పార్టీలకూ తెలుసు. అయినా ఎవరి రాజకీయ లబ్ధి వారికి ప్రధానమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో ఆమోదం పొందిన ప్రైవేటు సభ్యుల బిల్లులు కేవలం పధ్నాలుగే. వీటిలో సగం 1956లో ఆమోదం పొందినవే. అంతే కాదు, 1956లో ఆమోదం పొందిన సుప్రీం కోర్టు( ఎన్‌లార్జ్‌మెంట్ క్రిమినల్ అప్పిలేట్ జ్యూరిస్‌డిక్షన్) బిల్లు 1970లో కానీ చట్టరూపం దాల్చలేదు. అది కూడా ఆ బిల్లును ప్రభుత్వం తనదిగా చేసుకుని చట్టరూపంలోకి తెచ్చింది. నిరుడు రాజ్యసభ ఆమోదించిన ట్రాన్స్‌జెండర్ బిల్లు ఇప్పటికీ లోక్‌సభకు రానే లేదు. కేవలం పెద్దల సభలో మెజారిటీ ఉన్నందువల్లే అక్కడ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లుది కూడా అదే పరిస్థితి. పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్నుల వాటా 42శాతానికి పెరగటం ఇందుకు ఒక కారణం. అంతే కాదు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని పర్వతప్రాంత రాష్ట్రాలకు ఇప్పటి వరకు అమలులో ఉన్న ప్రత్యేక హోదా వచ్చే సంవత్సరం నుంచి తొలగిపోతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం అంటే, అధికార ఎన్‌డీఏ ప్రత్యేక దృష్టితో ఆలోచించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప సాధ్యపడదు.
ఓటింగ్‌కు పట్టుపడతాను
ఏపికి ప్రత్యేక హోదా కల్పించటంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును రేపు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. సవరణ బిల్లుకు మద్దతు సంపాదిస్తున్నామని, ఓటింగ్ జరిగితే బిల్లు సునాయసంగా పాస్ అవుతుందని ఆయన వాదిస్తున్నారు. బి.జె.పి తన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదన్నది ఆయన ధీమా. బిల్లును గెలిపించుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సీనియర్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఘంటాపథంగా చెబుతున్నారు.