జాతీయ వార్తలు

దళిత వ్యతిరేక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, జూలై 23: బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని, అది దళితులపై దాడులకు దిగుతున్న హిందూ ఫాసిస్టు శక్తులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు శనివారం ధ్వజమెత్తాయి. దళితులపై జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించాయి. బిజెపియేతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు శనివారం రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రిలో, మోట సమధియాలా గ్రామంలో దాడికి గురయిన దళితులను పరామర్శించారు.
బాధితులకు సంఘీభావం ప్రకటించడంతో పాటు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులను పరామర్శించడానికి సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ సమధియాలా గ్రామాన్ని సందర్శించారు. దళితులపై జరిగిన దాడి పట్ల మోదీ ఎందుకు వౌనం పాటిస్తున్నారని నిలదీశారు. జనతాదళ్ (యునైటెడ్) నేత శరద్ యాదవ్, సిపిఐ నాయకుడు డి.రాజా, బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా బాధితులను పరామర్శించడంతో పాటు దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శరద్ యాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ దళితులను చితకబాదిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.
దళితులను బహిరంగంగా కొడుతుంటే దగ్గరలో పోలీసు స్టేషన్ ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోలేదని ఆయన విమర్శించారు. బూటకపు ఆరోపణలపై జైలులో పెట్టిన దళితులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని, హిందూ ఫాసిస్టు రాజకీయాలను పెంచిపోషిస్తోందని, అందులో భాగమే ఈ దాడి అని రాజా విమర్శించారు. బాధితులను పరామర్శించిన ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి గోరక్షక సమితుల పేరిట ప్రైవేటు సైన్యాలను నడుపుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ సైన్యాలు గోరక్షణ పేరిట దళితులు, ముస్లింలపై దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రైవేటు సైన్యాలను నిషేధించాలని, వారు తమంత తాముగా మూసివేసుకోకుంటే వారిని జైలులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం.. గుజరాత్‌లో దళితులపై దాడికి నిరసనగా శనివారం పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న ఆర్జేడీ కార్యకర్తలు