జాతీయ వార్తలు

బీజేపీలో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు బీజేపీకి తీవ్ర నిరాశ కలిగించాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ఓటమి, మధ్యప్రదేశ్‌లో ఎటూకాని పరిస్థితి ఏర్పటం బీజేపీని షాక్‌కు గురిచేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌లా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం చూపిస్తే తమ పరిస్థితి ఎమిటనే ఆందోళన బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. రాజస్థాన్‌లో ఓటమి ఎదురైనా చత్తీస్‌గఢ్‌లో నాలుగోసారి అధికారంలోకి రావటంతోపాటు మధ్యప్రదేశ్‌లో పరిస్థితి పోటాపోటీగా ఉంటుందని, తెలంగాణాలో కనీసం ఎనిమిది సీట్లు గెలుచుకుంటామని
బీజేపీ అధినాయకత్వం అంచనా వేసింది. అయితే రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఓటింగ్ సరళి కమలనాథులకు మింగుడు పడటం లేదు. చత్తీస్‌గఢ్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటంలో తాము ఘోరంగా విఫలమయ్యామని బీజేపీ నాయకత్వం చెబుతోంది. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండటం వలన కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం సహజమని.. ఈ వ్యతిరేకతను తగ్గించుకోవటంలో తాము విఫలమయ్యామని వారు అంగీకరిస్తున్నారు.
అయితే రాజస్థాన్ ఫలితాలు బీజేపీకి కొంత ఊరట ఇచ్చాయి. పూర్తిగా తుడిచిపెట్టుకు పోతామనుకున్న తమకు బాగానే సీట్లు దక్కాయని కొంతలో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఎన్నికల ప్రచారం వలన తమ పరువు కొంతమేరకు దక్కిందన్నది వారి అభిప్రాయం. ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియాపై పూర్తిగా ఆధారపడి ఉంటే తమకు ఘోరమైన పరిస్థితి ఎదురయ్యేదని బీజేపీ నాయకులు అంగీకరిస్తున్నారు.
మధ్యప్రదేశ్ ఫలితాలు కొంతవరకు తాము అంచనా వేసిన విధంగానే ఉన్నాయని చెబుతున్నారు. పదిహేను సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నందున ఇక్కడ కూడా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. అయితే ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ అమలుచేసిన కొన్ని పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయని వారంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఇతర కారణాల మూలంగా కాంగ్రెస్ సునాయసంగా మెజారిటీని సంపాదించుకోవాలి కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది.. ఇంతవరకు వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. తెలంగాణ శాసనసభ ఫలితాలు బీజేపీ అధినాయకత్వాన్ని పూర్తి నిరాశకు గురి చేశాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఒక్క సీటుకే పరిమితమైంది. నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారం తమకు ఏ మాత్రం కలిసి రాలేదనే అభిప్రాయం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. మిజోరం శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు లభించటం కూడా బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఏవిధంగా ఉంటుందనే అంశంపై బీజేపీలో అప్పుడే చర్చ ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా సీట్లు లభించకపోవచ్చునని అంటున్నారు.

చిత్రం..కార్యకర్తలు లేక వెలవెలబోతున్న ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం