జాతీయ వార్తలు

పప్పుల ధరలు తగ్గేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో పప్పుల ధరలు విపరీతంగా పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో గురువారం ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటూ ‘మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని శుష్క వాగ్దానాలు చేయవచ్చు. కాని, పప్పుల ధరలు ఎప్పటివరకు తగ్గుతాయో ఖచ్చితమైన తేదీని చెప్పండి’ అని ప్రధాని మోదీని నిలదీశారు. ఎన్‌డియే అధికారంలోకి వచ్చిన తరువాత కాయధాన్యాలు (పప్పులు), కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయని, అయితే ఈ సరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ రైతులు మాత్రం ఎలాంటి లబ్ధి పొందలేకపోతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ 2014 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘మా బచ్చే రాత్ రాత్ రోతే హై, ఆసూన్ పీకే సోతే హై’ (తల్లీపిల్లలు రాత్రంతా ఏడుస్తూ, తమ కన్నీళ్లనే తాగుతూ నిద్రపోతున్నారు) అని అన్నారని రాహుల్ గుర్తుచేశారు. ‘ఆహా ఏమి ప్రసంగం’ అని రాహుల్ గాంధీ మూడుసార్లు అంటూ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఆ సమయంలో మోదీ సభలో లేరు. ‘నేను ప్రధానమంత్రికి ఆయన గత సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయదలచుకున్నాను. మోదీజీ ఆ వాగ్దానాల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. మరచిపోయారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ధరలను తగ్గిస్తుందని కూడా మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఆనాడు మోదీ విమర్శించినప్పుడు, ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న కూరగాయలు, పప్పుల ధరలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వివరించారు. అప్పుడు (2014 ఫిబ్రవరిలో) కిలో టమాట ధర రూ.18 ఉండగా, ఇప్పుడు (2016 జూలైలో) రూ.55కు పెరిగిందని వెల్లడించారు. కిలో మినపప్పు ధర అప్పుడు రూ.70 ఉండగా, ఇప్పుడు రూ.160కి పెరిగిందని, కందిపప్పు ధర అప్పుడు రూ.75 ఉండగా, ఇప్పుడు రూ.180కి పెరిగిందని రాహుల్ గాంధీ వివరించారు. యుపిఏ హయాంలో కిలో కందిపప్పు ధర రూ.75 ఉండగా, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) రూ.45 ఇవ్వడం జరిగిందని, అంటే తేడా కేవలం రూ.30 మాత్రమేనని చెప్పారు. ఎన్‌డియే హయాంలో దీని ధర మార్కెట్‌లో రూ.180 ఉండగా, రైతులకు ఇస్తున్న ఎంఎస్‌పి రూ.50 మాత్రమేనని ఆయన తెలిపారు. వీటి రెండింటి మధ్య తేడా రూ.130 ఉండగా, మిగతా రూ.100 ఎక్కడికి వెళ్తున్నాయని రాహుల్ గాంధీ మోదీ సర్కారును నిలదీశారు.